టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పరిగి ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రాంరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. జలగం వెంకట్రావు, ఎన్ జనార్దన్‌రెడ్డి మంత్రివర్గాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు.
సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన అయన.. 2014 ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో బీజేపీలో చేరారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయణ పరిణామాల నేపథ్యంలో బీజేపీని వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ సాయంత్రం మహబూబ్‌నగర్‌లో మహమ్మదాబాద్‌లో రాంరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యలు తెలిపారు. రాంరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.