రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు.. ఇదే చివరిది అంటూ ప్రచారం.. హాజరయ్యేందుకు రైతుల సుముఖత

|

Jan 15, 2021 | 11:12 AM

సాగుచట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పోరుబాట సాగిస్తున్న రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు జరపనుంది. విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు..

రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు.. ఇదే చివరిది అంటూ ప్రచారం.. హాజరయ్యేందుకు రైతుల సుముఖత
Follow us on

Farmers Protest : సాగుచట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పోరుబాట సాగిస్తున్న రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు జరపనుంది. విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ భేటీయే చివరి సమావేశం కావచ్చన్న వార్తల నేపథ్యంలో చర్చలకు హాజరయ్యేందుకు రైతు సంఘాలు సుముఖత వ్యక్తం చేశాయి.

అయితే వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకు మరేదీ సమ్మతం కాదని తేల్చిచెప్పాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి భేటీలో కేంద్రంతో ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశలు లేవని కిసాన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు ఎలాంటి కమిటీలు అవసరం లేదని.. సాగు చట్టాల రద్దు, తమ పంటలకు కనీసమద్దతు ధరనే తాము కోరుతున్నట్లుగా వెల్లడించారు.

న్యాయస్థానాలు చట్టాలను రద్దు చేయలేవని తెలిసినప్పటికీ కేంద్రం రైతుల మనోభావాలతో ఆటలాడుతోందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. సుప్రీం నియమించిన కమిటీలో నుంచి వైదొలగిన భూపీందర్ సింగ్ మాన్ నిర్ణయాన్ని రైతులు స్వాగతించారు. కమిటీలోని ఇతర సభ్యులు ఆయనను అనుసరించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని అన్నారు. జనవరి 26న అమర్ జవాన్ జ్యోతి వద్ద చరిత్రాత్మక దృశ్యం కళ్లకు కడుతుందని చెప్పారు.

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఊరేగింపు వెళ్తామని… అమర్ జవాన్ జ్యోతి వద్ద జెండాను ఎగరవేస్తామన్నారు. ఒక వైపు రైతులు… మరోవైపు జవాన్లు. ఇది ఒక చరిత్రాత్మక దృశ్యం అవుతుందని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ .

మరోవైపు ఈ సమావేశంలో చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆశాభావం వ్యక్తంచేశారు. రైతు సంఘాలతో పారదర్శకంగా చర్చలు జరుపుతామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Mutton Prices : పండగ పూట మంట పుట్టిస్తున్న మటన్ ధరలు.. కనుమ రోజు భారీగా పెంచేసిన వ్యాపారులు

ఇండోనేషియాలో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదు.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

అన్ని రాష్ట్రాలకు చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్.. తెలుగు రాష్ట్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి