
Farmers Protest: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు మెట్టు దిగడంలేదు. కేంద్ర ప్రభుత్వం వైఖరి మారకపోవడంతో రైతు సంఘాలు ఆందోళనలు ముమ్మరం చేశాయి. ఇవాళ్టి నుంచి జాతీయ రహదారిని దిగ్బంధం, రిలే దీక్షలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రిలే నిర్వహ దీక్షలతో.. ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి సన్నద్ధమయ్యాయి. అయితే, నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని రైతులు ప్రకటించారు. ముందుగా ఆ చట్టాల రద్దుపైనే మాట్లాడాలని, ఆ తర్వాతే మిగిలిన అంశాలను చర్చిస్తామని స్పష్టం చేశారు. అదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెబుతున్నారు.
రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానా-రాజస్థాన్ సరిహద్దును పోలీసులు మూసివేశారు. ఢిల్లీకి రైతులు రాకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ-నోయిడా మార్గం మీద ఏర్పాటు చేసిన శిబిరాలను తొలగించేందుకు రైతు సంఘాలు ఒప్పుకోవడం అంతర్గత విభేదాలకు దారితీసింది. కేంద్రమంత్రులు అభ్యర్థన మేరకు నోయిడా మార్గంలో శిబిరాలను రైతులు తొలగించారు. దీన్ని కొందరు అన్నదాతలు వ్యతిరేకించారు.
నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మెజార్టీ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు నిరాహార దీక్షను అన్నదాతలు చేపట్టారు. వారికి సంఘీభావంగా పలు రాజకీయ పార్టీల నేతలు కూడా ఒక రోజు నిరాహార దీక్షలు నిర్వహించారు.
రైతు మేలు కోసమే కేంద్రం కొత్త చట్టాలు తెచ్చిందని బీజేపీ నేత డీకే అరుణ చెప్పారు. ప్రతిపక్షాలు కొత్త చట్టాలపై రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పిస్తే అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు. కొత్త చట్టాలను దళారులే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
రైతులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, రైతుల మనోభావాలను వినడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా వారి అపోహలను తొలగించడానికి, వారికి హామీ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ రెడీగా ఉందన్నారు. వ్యవసాయ రంగం, రైతాంగం తిరోగమన దిశగా వెళ్లే ఏ చర్యను కూడా తమ ప్రభుత్వం తీసుకోదని ఆయన తేల్చి చెప్పారు.
పలు రాష్ట్రాలకు చెందిన పది రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసి తమ మద్దతును తెలిపాయి. ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీతో అనుబంధంగా ఉన్న ఉత్తర ప్రదేశ్, కేరళ, బీహార్, తమిళనాడు, తెలంగాణ, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన పది రైతు సంఘాల నేతలు వ్యవసాయ చట్టాలను సమర్థించారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రైతు సంఘాలతో మరోసారి భేటీ అంశంపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశముంది. వీరితో పాటు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రైతుల సమావేశంలో పాల్గొన్నారు. ఆందోళన రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎలా అనుసరించాలి.. వివిధ రాష్ట్రాల్లో పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన విస్తరిస్తున్న నేపథ్యంలో కౌంటర్ ప్రచారానికి కమలం నేతలు రెడీ అవుతున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నారు. దేశంలో కనీసం వంద చోట్ల సదస్సులు నిర్వహించాలని బీజేపీ నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మూడు వ్యవసాయ బిల్లులతో మధ్యవర్తుల (మండీ దళారులు) బెడద తగ్గి రైతాంగానికి నేరుగా ప్రయోజనం కలుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.