ఏడాది లేదా ఏడాదిన్నరవరకు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబందించి కేంద్రం చేసిన ప్రతిపాదనపై రైతు సంఘాలు గురువారం తమలో తాము చర్చించుకోనున్నాయి. మొదట ఈ ప్రతిపాదనకు ఇవి అంగీకరించలేదు. అయితే అంతర్గతంగా దీనిపై చర్చిస్తే బాగుంటుందని ఈ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పరస్పర సంప్రదింపులతో సంక్షోభం పరిష్కారమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏమైనా..తమలో తాము చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నదాతల సంఘాల్లో కొన్ని భావిస్తున్నాయి. అటు ఓ జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నది కూడా ప్రభుత్వ ప్రతిపాదన. ఈ కమిటీలో యధాప్రకారం ప్రభుత్వం నుంచి, ఈ రైతు సంఘాల నుంచి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కాలంలో రైతులు సింఘు బోర్డర్ నుంచి తమ రాష్ట్రాలకు వెళ్లిపోగలరని కేంద్రం ఆశిస్తోంది. వీరి ఆందోళన గురువారం నాటికీ 57 రోజులకు చేరుకుంది. ఇక శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులు అన్నదాతలతో సంప్రదింపులు జరపనున్నారు.
మొత్తానికి కేంద్రం కొంత మెత్తబడిందని అంటున్నారు. శుక్రవారం జరిగే చర్చల్లో రైతు నాయకులు తమ అభిప్రాయాలను స్పష్టం చేయనున్నారు.