ప్రతిభను గుర్తించే చోటుకు వలస వెళ్లిన అద్భుత క్రికెటర్లు

వలస జీవితాన్ని ఎవరూ కోరుకోరు..బతుకుతెరువు కోసమో... మెరుగైన జీవితం కోసమో. ఎదురవుతున్న నిరాదరణ ఫలితమో .. ప్రతిభకు పట్టం కట్టని చోట ఉండటం ఇష్టం లేకనో ఉన్నచోటును వదిలేసి వలస వెళ్లిపోతారు..

ప్రతిభను గుర్తించే చోటుకు వలస వెళ్లిన అద్భుత క్రికెటర్లు
Follow us
Balu

| Edited By: Sanjay Kasula

Updated on: Jun 17, 2020 | 11:36 AM

మొన్నీమధ్య ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్ క్లార్క్‌ రెండు మూడు మాటలన్నాడు. అవేమిటంటే విరాట్‌ కోహ్లీని స్లెడ్జింగ్‌ చేసేందుకు ఆసీస్‌ క్రికెటర్లు అస్సలు ప్రయత్నించరట! అందుకు కారణం ఐపీఎల్‌ కాంట్రాక్టులు ఎక్కడ పోతాయోనన్న భయమేనట! టీమిండియా ప్లేయర్లను చూస్తే ఆసీస్‌ ఆటగాళ్లకు వణుకట! ఏమైనా అనేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారట! క్లార్క్‌ చెప్పింది అక్షర సత్యాలు.

ఇప్పుడు ఇండియన్‌ ప్లేయర్లను ఏమైనా అనే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు.. కారణం ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో బీసీసీఐ- అదే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు చాలా చాలా పవర్‌ఫుల్‌.. బీసీసీఐ దగ్గరున్నంత సొమ్ము మరే స్పోర్ట్స్‌ బాడీ దగ్గర లేదు.. దాదాపుగా ఇలాంటి అభిప్రాయాలను క్లార్క్‌ వ్యక్తం చేశాడు.. ఇప్పుడంటే రిచ్చెస్ట్‌ బాడీ అయ్యింది కానీ .. ఒకప్పుడు బీసీసీఐ కూడా మిగతా స్పోర్ట్స్‌ బాడీల్లాగే ఆర్ధిక సమస్యలతో అల్లాడేది. అవసరాల నిమిత్తం బోర్డు దగ్గర తగినంత సొమ్ము ఉండేది కాదు.. అందుకే ప్లేయర్లకు తగినంత రెమ్యూనిరేషన్‌ ఇచ్చేది కాదు..ఈ కారణంగానే చాలా మంది ప్లేయర్లు ఇంకా ఆడగిలిగే సత్తా ఉన్నా మిడిల్‌ డ్రాప్‌ అయ్యారు.. నెలకింత జీతం వచ్చే ఉద్యోగం చూసుకుని సెటిల్‌ అయ్యారు.. కొందరైతే తమ ప్రతిభకు వెలకట్టే దేశాలను వెతుక్కుంటూ వలస వెళ్లిపోయారు.

వలస జీవితాన్ని ఎవరూ కోరుకోరు..బతుకుతెరువు కోసమో… మెరుగైన జీవితం కోసమో. ఎదురవుతున్న నిరాదరణ ఫలితమో .. ప్రతిభకు పట్టం కట్టని చోట ఉండటం ఇష్టం లేకనో ఉన్నచోటును వదిలేసి వలస వెళ్లిపోతారు.. ఇలాంటి పరిస్థితి అప్పట్లో భారత క్రికెటర్లకు కూడా ఉండేది… సెలెక్టర్ల నీచ రాజకీయాలు ఓ పక్క… ఆటగాళ్లకు సరైన సదుపాయాలను కల్పించని బోర్డు వైఖరి మరో పక్క. ఆటగాళ్లను బాగా ఇబ్బంది పెట్టేవి. అసలు ఆర్ధిక భరోసా కూడా ఆటగాళ్లకు ఉండేది కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన క్రికెటర్లు కూడా ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక తప్పని పరిస్థితులలో ఇతర దేశాలకు వలస వెళ్లారు.. అలాంటి ముగ్గురు క్రికెటర్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం!

ఫరూక్‌ ఇంజనీర్‌, బుధి కుందెరన్‌, రూసి సూర్తీ.. ఈ ముగ్గురూ ఆరో దశకంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఫరూక్‌ ఇంజనీర్‌ ఓ దశాబ్దం పాటు టీమిండియాకు ఆడాడు కానీ మిగిలిన ఇద్దరు మాత్రం రాజకీయాలు, సెలక్టర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా బలిపశువులయ్యారు. ఇక ఈ త్రయంలో ఫరూక్‌ ఇంజనీర్‌, కుందెరన్‌లు వికెట్‌ కీపర్‌ స్లాట్‌ కోసం తీవ్రంగా పోటీపడ్డారు.. సూర్తీ ఏమో ఎడమచేతి వాటం కలిగిన మంచి ఆల్‌రౌండర్‌… ఈయనకు ‘పూర్‌మాన్స్‌ గారీ సోబర్స్‌’ అన్న ముద్దుపేరు కూడా ఉంది.. ఈ ఉపమానం హండ్రెడ్‌ పర్సంట్‌ కరెక్ట్‌.. సోబర్స్‌ అంతటి అసమాన ప్రతిభావంతమైన ఆల్‌రౌండర్‌ రూసి సూర్తీ! ఫరూక్‌ ఇంజనీర్‌ గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ.. ఆయనో అద్భుతమైన ఆటగాడు.. ఓపెనర్‌గా, వికెట్‌ కీపర్‌గా కొన్ని మెరుపులు మెరిపించాడు.. ఈయన సొగసైన ఆటకు ముచ్చటపడి ఇంగ్లీష్‌ కౌంటీ లాంకషైర్‌ తమ జట్టులోకి సాదరంగా ఆహ్వానించింది.. ఫరూక్‌తో కాంట్రాక్టును కదుర్చుకుంది.. ఓ ఇండియన్‌ ప్లేయర్‌కు దక్కిన అరుదైన గౌరవమది! 1968 నుంచి తను క్రికెట్‌ నుంచి రిటైరయ్యేంత వరకు అంటే 1976 వరకు లాంకషైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు ఫరూక్‌.. ఫరూక్‌ ఇంజనీర్‌లో చక్కటి కీపింగ్‌ మెళకువలు…పరుగులు సాధించే టాలెంట్‌ ఉన్నా 1971లో వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టులో ఈయనకు చోటు దక్కలేదు.. ఇందుకు సెలెక్టర్లు ఓ సిల్లీ రీజన్‌ చెప్పుకొచ్చారు. దేశవాళి క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు కాబట్టే ఫరూక్‌ను పరిగణనలోకి తీసుకోలేదట! అలా చెప్పిన సెలెక్టర్లే మూడు నెలల తర్వాత ఇంగ్లాండ్‌ టూర్‌కు ఫరూక్‌ను ఎంపిక చేశారు. కేవలం టెస్ట్ మ్యాచ్‌లు ఆడే కండీషన్‌ మీదనే లాంకషైర్‌ కూడా ఫరూక్‌కు పర్మిషన్‌ ఇచ్చింది. అసలు లాంకషైర్‌ హెడ్‌క్వార్టర్స్‌ అయిన మాంఛెస్టర్‌లో ఫరూక్‌ చాలా ఫేమస్‌ ప్లేయర్‌! అసలు ఇంజనీర్‌ సొగసైన బ్యాటింగ్‌ను చూసేందుకే ప్రేక్షకులు దూరదూరాల నుంచి స్టేడియంకు వచ్చేవారు. ఫరూక్‌కు బోలెడంత మంది అభిమానులు..క్రికెట్‌ నుంచి రిటైరయ్యాక ఫరూక్‌ తన భార్య జూలీతో అక్కడే స్థిరపడిపోయారు. లాస్టియర్‌ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ఫరూక్‌ను ఫ్యాన్స్‌ చుట్టుముట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు మాంఛెస్టర్‌లో ఆయనకు ఎంత ఫాలోయింగ్‌ ఉందో!

బుధిసాగర్‌ కృష్ణప్ప కుందెరన్‌ది మరో కథ.. కర్నాటకలో పుట్టినప్పటికీ పెరిగింది అంతా ముంబాయిలోని వస్త్ర పరిశ్రమల ప్రాంతంలో! కుందెరన్‌ క్రికెట్‌ ఆడటం తండ్రికి ఓ పట్టాన నచ్చేది కాదు.. అయితే తల్లికి మాత్రం తన కొడుకు క్రికెట్‌లో మంచి పేరు సంపాదించాలనే కోరిక బలంగా ఉండేది. భర్తకు తెలియకుండా క్రికెట్‌ దుస్తులను కూడా కొడుకుకు కుట్టి ఇచ్చింది. అప్పట్లో క్రికెట్‌ యూనిఫామ్‌ అంటే వైట్‌ డ్రెస్సే కదా! అలా అమ్మ ఇచ్చిన ప్రొత్సాహంతో కుందెరన్‌ క్రికెట్‌లో రాటుదేలాడు.. ఓ లోకల్‌ మ్యాచ్‌లో కుందెరన్‌ డబుల్‌ సెంచరీ సాధించడం, ఫోటోతో సహా ఆ వార్త పేపర్‌లో రావడంతో తండ్రికి క్రికెట్‌లో తన కుమారుడి శక్తిసామర్థ్యాలేమిటో తెలిసింది.. అప్పట్నుంచి తండ్రి కూడా కుందెరన్‌ భుజం తట్టడం మొదలు పెట్టాడు.. అనతికాలంలోనే కుందెరన్‌ రైల్వే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.. అప్పుడు నేషనల్‌ సెలెక్షన్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న లాలా అమర్‌నాథ్‌కు కుందెరన్‌ ఆట తీరు ఎంతగానో నచ్చేసింది.. వెంటనే అతడిని భారత జట్టులో తీసుకున్నాడు. అలా 1959-60లో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టుతో ఆడే అవకాశం కుందెరన్‌కు లభించింది. ముంబాయిలో జరిగిన మ్యాచ్‌తో కుందెరన్‌ టెస్ట్‌ల్లో అడుగు పెట్టాడు. అప్పుడతడి వయసు 20 ఏళ్లే! ముంబాయిలోనే ఉంటున్నాడు కాబట్టి కుందెరన్‌కు బీసీసీఐ ఎలాంటి వసతీ సౌకర్యాలను కల్పించలేదు.. పాపం తెల్లవారక ముందే ట్రైన్‌ పట్టుకుని స్టేడియంకు వచ్చేవాడు కుందెరన్‌. తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసిన కుందెరన్ రెండో ఇన్నింగ్స్‌ దురదృష్టవశాత్తూ హిట్‌ వికెట్‌ అయ్యాడు.. అయితేనేం తర్వాత చెన్నైలో జరిగిన టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్‌గా వచ్చి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.. 12 బౌండరీలతో 71 పరుగులు చేశాడు.. కుందెరన్‌ను ఎలా అవుట్‌ చేయాలో తెలియక ఆసీస్‌ బౌలర్లు తలలు పట్టుకున్నారు. టీమిండియా చేసిన 149 రన్స్‌లో కుందెరన్‌ చేసిన 71 పరుగులే టాప్‌ స్కోర్‌.. సెకండ్‌ ఇన్నింగ్సలోనూ అవే మెరుపులు.. అదే ధాటి… 33 పరుగులు చేశాడు కుందెరన్‌.. ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతే పోయింది కానీ… ఓ అద్భుతమైన ఆటగాడు దొరికాడని సంబరపడ్డారు అభిమానులు. 1961-62లో భారత్‌లో ఇంగ్లాండ్‌ జట్టు పర్యటించింది.. ఆ సిరీస్‌లో దుమ్ము దులిపేద్దామనుకున్న కుందెరన్‌కు నిరాశే మిగిలింది. కేవలం తొలి టెస్ట్‌లోనే కుందెరన్‌కు అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు ఆ తర్వాత టెస్ట్‌ల నుంచి డ్రాప్‌ చేశారు.. కుందెరన్‌ ప్లేస్‌లో ఫరూక్‌ ఇంజనీర్‌కు చోటు కల్పించారు. దొరికిన ఆ అవకాశాన్ని ఇంజనీర్‌ సద్వినియోగం చేసుకున్నాడు.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1963-64లో జరిగిన ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మళ్లీ కుందెరన్‌ అవసరం వచ్చి పడింది.. అందుకు కారణం ఫరూక్‌ ఇంజనీర్‌ గాయంతో బాధపడుతుండటమే! చెన్నైలో జరిగిన తొలి టెస్ట్‌లో కుందెరన్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లను చితకబాదేసి 192 రన్స్‌ చేశాడు.. తర్వాతి రెండు టెస్ట్‌లలో ఓ సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు.

అదేం విచిత్రమో.. తర్వాతి సిరీస్‌లో అటు ఇంజనీర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు… ఇటు కుందెరన్‌కు పిలుపు రాలేదు.. కే.ఎస్‌.ఇంద్రజిత్‌సిన్హ్‌జీ అనే ప్లేయర్‌కు అవకాశమిచ్చి వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను అప్పగించారు సెలెక్టర్లు… 1966-67లో స్వదేశంలో జరిగిన వెస్టిండీస్‌ సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్‌లు ఆడాడు కుందెరన్‌.. ఓ రెండు ఇన్నింగ్స్‌లలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.. అయినా ఇంజనీర్‌ కోసం కుందెరన్‌ను డ్రాప్‌ చేసింది సెలెక్షన్‌ కమిటీ! ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్‌ సిరీస్‌లో చివరి రెండు టెస్ట్‌లు ఆడాడు.. బర్మింగ్‌హమ్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో బౌలింగ్‌ కూడా చేశాడు. అయితేనేం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో జరిగిన సిరీస్‌ల నుంచి కుందెరన్‌ను పక్కన పెట్టేశారు సెలెక్టర్లు.. ఇలా ప్రతీసారి కుందెరన్‌కు అవమానాలే జరిగాయి.. సెలెక్టర్లు ఇతడికి మానసికక్షోభ కలిగించారు.. ఇక ఇక్కడ ఉండి అవమానాలు ఎదుర్కొనే బదులు టాలెంట్‌ను గుర్తించే దేశానికి వెళ్లిపోవడం బెటరనుకున్నాడు కుందెరన్‌.. అదే సమయంలో స్కాట్లాండ్‌లోని డ్రంపెలియర్‌ క్లబ్‌క్రికెట్‌ నుంచి అతడికి ఆహ్వానం అందింది… మరో ఆలోచన చేయకుండా ఆ కాంట్రాక్ట్‌ సైన్‌ చేశాడు కుందెరన్‌.. 1970లో పెట్టేబెడా సర్దుకుని గ్లాస్గోకు వెళ్లిపోయాడు.. 1995లో క్రికెట్‌ నుంచి పూర్తిగా తప్పుకున్న కుందెరన్‌ 66ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల కేన్సర్‌తో 2006లో స్కాట్లాండ్‌లోనే కన్నుమూశాడు..

రూసీ ఫ్రామ్‌రోజ్‌ సూర్తీ కూడా సెలెక్టర్ల నిరాదరణకు గురైన అద్భుతమైన ఆటగాడే! అతడు మైదానంలో అడుగుపెడుతుంటేనే ప్రత్యర్థులకు చెమటలు పట్టేవి.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు సూర్తీ.. అలాగే మీడియం పేస్‌ బౌలింగ్‌నూ వేయగలడు.. స్పిన్‌తో మాయనూ చేయగలడు.. ఇక ఫీల్డింగ్‌లోనూ అంతే! షార్ట్‌లెగ్‌లో ఎంత బ్రిలియంట్‌గా ఫీల్డింగ్‌ చేయగలడో.. డీప్‌లోనూ అంతే చాకచక్యాన్ని ప్రదర్శించేవాడు. 1960లో పాకిస్తాన్‌తో ముంబాయిలో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్‌ల్లో అడుగు పెట్టాడు సూర్తీ. ఆ మ్యాచ్‌ తర్వాత సూర్తీ ఆ సిరీస్‌లోని ఆఖరి టెస్ట్‌ ఆడాడు. అందులో హాఫ్‌ సెంచరీ చేశాడు. 1961-62లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు సూర్తీని ఎంపిక చేయలేదు కానీ ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్‌ సిరీస్‌కు మాత్రం సూర్తీని జట్టులో తీసుకున్నారు. వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొగలిగిన బ్యాట్స్‌మన్‌లలో సూర్తీ ఒకరు. దీని తర్వాత ఇంగ్లాండ్‌ టీమ్‌ భారత్‌లో అడుగు పెట్టింది.. అప్పుడు ఏ రీజనూ లేకుండానే సూర్తీని పక్కన పెట్టారు సెలెక్టర్లు. ఆ తర్వాత మూడేళ్లపాటు సూర్తీతో ఓ ఆట ఆడుకున్నారు సెలెక్టర్లు.. ఓ టెస్ట్‌లో ఆడించడం.. ఆ వెంటనే జట్టులోంచి తొలగించడం.. ఇలా అతడిని మానసికంగా బాగా హింసపెట్టారు.. 1967-68లో భారత జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలకు వెళ్లింది.. అప్పుడు మాత్రం సూర్తీని తీసుకున్నాడు. ఆసీస్‌తో ఆడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో సూర్తీ 70, 53 పరుగులు చేయడమే కాకుండా, 74 పరుగులకు అయిదు వికెట్లు తీసుకున్నాడు.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో అయితే ఎమ్‌ఎల్‌ జైసింహతో కలిసి ఇండియాను దాదాపుగా విజయపు అంచుల్లోకి తీసుకెళ్లాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో ఎనిమిది టెస్ట్‌లు ఆడిన సూర్తీ 688 పరుగులు చేశాడు.. 26 వికెట్లు తీసుకున్నాడు. ఇలా బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్న ఆటగాడిని ఎవరైనా తొలగిస్తారా? మన సెలెక్టర్లు మాత్రం ఆ పని చేశాడు.. 1968-69లలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు భారత పర్యటనకు వచ్చాయి.. అప్పుడు సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న విజయ్‌ మర్చంట్‌ మెదడులో ఏ పురుగు తొలిచిందో కానీ జట్టును యువ ఆటగాళ్లతో నింపాలనే పిచ్చి ప్రయోగం చేశాడు.. సూర్తీ ఉన్నా అనుభవ లేమి కొట్టొచ్చినట్టు కనిపించింది.. ఫలితంగా భారత్ ఓటమి చెందాల్సి వచ్చింది. మళ్లీ సూర్తీని జట్టులోంచి తొలగించారు.. అదే సమయంలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ నుంచి సూర్తీకి పిలుపు వచ్చింది.. వెంటనే బ్రిస్బేన్‌కు బయలుదేరి వెళ్లాడు సూర్తీ. షెఫీల్డ్‌షీల్డ్‌కు ఆడిన మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1972 వరకు క్వీన్స్‌లాండ్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్‌ నుంచి తప్పుకున్నాక అక్కడే స్థిరపడ్డాడు.. 2013లో తన 76వ ఏట కన్నుమూశాడు సూర్తీ.

కుందెరన్‌, సూర్తీలిద్దరూ అసమాన ఆటగాళ్లు.. కాకపోతే అవకాశాలు దక్కక ఎంతో బాధను అనుభవించారు.. అన్నట్టు మరో విషయం కూడా ఉంది.. ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్డే మ్యాచుల్లోనూ చక్కగా రాణించారు.. ఆస్ట్రేలియాలో జరిగే కౌంటీలన్నీ లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచులే కదా! ఈ దేశం వారి ప్రతిభను గుర్తించలేకపోయింది.. వారి నైపుణ్యానికి ప్రోత్సాహం అందించలేకపోయింది.. ఫలితంగా ఇద్దరు ఆటగాళ్లను మనం వదిలేసుకున్నాం… కాదు కాదు.. వారే అవకాశాలు అందిపుచ్చుకుని వలస వెళ్లారు.. తగిన గుర్తింపును, గౌరవాన్ని అందుకున్నారు.. ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు..

——–బాలు