పదునెక్కుతున్న నెత్తుటి రుచి మరిగిన వేటకొడవళ్లు, కర్నూలులో రాంభూపాల్‌ పై దాడి.. సీమలో మళ్లీ తెరపైకి ఫ్యాక్షన్.!

|

Dec 30, 2020 | 4:28 PM

రాయలసీమ రగులుతోందా? పాతకక్షలు కొత్తగా తెరపైకి వస్తున్నాయా? అవును,  పౌరుషాలు మీసం దువ్వుతున్నట్టు కనిపిస్తున్నాయి. మచ్చు కత్తులు విచ్చుకుంటున్న పరిస్థితి...

పదునెక్కుతున్న నెత్తుటి రుచి మరిగిన వేటకొడవళ్లు, కర్నూలులో రాంభూపాల్‌ పై దాడి.. సీమలో మళ్లీ తెరపైకి ఫ్యాక్షన్.!
Follow us on

రాయలసీమ రగులుతోందా? పాతకక్షలు కొత్తగా తెరపైకి వస్తున్నాయా? అవును,  పౌరుషాలు మీసం దువ్వుతున్నట్టు కనిపిస్తున్నాయి. మచ్చు కత్తులు విచ్చుకుంటున్న పరిస్థితి. నెత్తుటి రుచి మరిగిన వేటకొడవళ్లు మళ్లీ పదునెక్కుతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా రాయలసీమలో పగలు, ప్రతీకారాలతో జనం మళ్లీ రగిలిపోతున్నారు. నిన్న కడపలో టీడీపీ నేత సుబ్బయ్య హత్యను మరిచిపోకముందే.. తాజాగా కర్నూలులో ఓ వ్యక్తి హత్యకు కుట్ర పన్నారు. అయితే తృటిలో తప్పించుకున్న బాధితుడు.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామానికి చెందిన రాంభూపాల్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిల మధ్య పాత తగాదాలున్నాయి. వారి తండ్రుల నుంచి కక్షలు రగులుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాంభూపాల్‌ .. స్వగ్రామం వదిలి హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ ఉన్నాడు. ఇటీవల స్వగ్రామం వెళ్లిన రాంభూపాల్‌ ఇవాళ ఓ ఆలయానికి వెళ్లాడు. తర్వాత అక్కడే ఉన్న ఓ షాపులో టీ తాగుతుండగా.. ప్రత్యర్ధి వర్గం అతనిపై దాడికి పాల్పడింది. అయితే మొదట ప్రమాదంగా భావించిన రాంభూపాల్‌ తేరుకునేసరికి.. ఇనుపరాడ్‌, గన్‌తో దాడి చేయబోయారు. ఆ గలాటా మధ్య కొందరు ప్రజలు అక్కడ గుమిగూడడంతో.. అమర్‌నాథ్‌ పరారైనట్టు బాధితుడు రాంభూపాల్‌ తెలిపాడు. కాలికి గాయం కావడంతో.. పత్తికొండ ఆసుపత్రిలో చేరిన రాంభూపాల్‌.. పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తనను హత్య చేసేందుకు అమర్‌నాథ్‌రెడ్డి కుట్ర పన్నినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.