Facebook : ప్రపంచంలో కరోనా వైరస్ అడుగు పెట్టినప్పటి నుంచి జనజీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. అంతేకాదు ఉద్యోగులు కూడా ఆఫీసులకు వెళ్లకుండానే ఇంటి దగ్గరే వర్క్ చేసే విధంగా అనేక కంపెనీలు చర్యలు తీసుకున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, గూగుల్, ఇంఫోసిస్, టాటా వంటి అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ నిచ్చాయి. దీంతో దాదాపు 15 నెలల నుంచి ఉద్యోగులు తమ ఇంటి వద్దనుంచి ఉద్యోగ విధులను నిర్వర్తిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ నిచ్చింది. కరోనా తగ్గి లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం ఎవరైనా తన ఉద్యోగులు పర్మినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎంచుకోవచ్చని ప్రకటించింది.
అమెరికాలో దాదాపు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావడం, త్వరలోనే అన్ని కార్పొరేట్ సంస్థలు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ తాజా ప్రకటన చేసింది. జూన్ 15 నుండి, రిమోట్‌గా ఉద్యోగం చేయాలనుకునే ఏ ఉద్యోగి అయినా శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకునేలా అనుమతిస్తున్నామని ఫేస్‌బుక్ తెలిపింది. అంతేకాదు కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగులు ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే అందుకు తగిన సహాయం చేస్తామని ప్రకటించింది.
తమ ఉద్యోగులు ఎక్కడ నుంచి పని చేతున్నారనే విషయంకంటే.. ఎలా పని చేస్తున్నారనేదే ముఖ్యమని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. కరోనా సంక్షోభంలో ఎక్కడినుంచైనా పనిచేయవచ్చని తెలిసిందని.. అందుకనే పనిచేసే ప్రదేశం కంటే పనిచేసే విధానం ముఖ్యమని అన్నారు.
రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల కోసం వ్యక్తిగతంగా సమావేశాలను నిర్వహించాలని యోచిస్తోంది.దీనికి అనుగుణంగా హైబ్రిడ్ కార్యాలయాలు, రిమోట్ సెటప్ కోసం కంపెనీ ప్రణాళికలను నిర్దేశిస్తోందన్నారు.
మరోవైపు సిలికాన్ వ్యాలీలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, అందరూ వ్యాక్సిన్‌లు తీసుకున్న నేపథ్యలో ఫేస్‌బుక్ ఆఫీసులను ఓపెన్ చేయాలని యోచిస్తోంది. అయితే తిరిగి వచ్చిన ఉద్యోగుల పని షెడ్యూల్ సరళంగా ఉంటుందని, కనీసం సగం సమయం క్యాంపస్‌లో ఉండాలని చెబుతోంది. అలాగే ఫేస్‌మాస్క్, భౌతిక దూరం లాంటి కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. సుమారు 60వేల ఉద్యోగులున్న ఫేస్‌బుక్ సిలికాన్ వ్యాలీలో వచ్చే సెప్టెంబర్ ఆరంభం నాటికి 50 శాతం సామర్థ్యంతో పని చేయాలని భావిస్తోంది. అయితే ఫేస్ బుక్ ఉద్యోగులు తమకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు