Jc Prabhakar Reddy Comments On Jagan : వాహనాలు అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో న్యాయం గెలుస్తుందన్నారు మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇంజిన్, చాయిస్ నెంబర్లు ద్వారా వాహనం మొత్తం వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. తమను ఏజెంట్లు మోసం చేశారని.. పోలీసులపై తాను విమర్శలు చేయనని చెప్పారు. నాగాలాండ్‌లో రూల్స్ వేరేగా ఉన్నాయని..అందుకే ఈ గందరగోళం మొదలైందని వివరించారు. తన బస్సులన్నీ ఆగిపోయాయని.. బస్సులు తిప్పే పరిస్థితి లేదన్నారు. ఆర్టీసీ పరిస్థితి అంతే దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.
గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ తనను అరెస్ట్ చేయించారన్నారు జేసీ. అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా కేసులు పెట్టగలదని.. ఎన్టీఆర్ హయాంలో 11 రోజులు జైల్లో ఉన్నానని.. ఇప్పుడు 54 రోజులు జైల్లో ఉన్నట్లు వెల్లడించారు. అరెస్టులకు పెద్దగా కారణాలు అవసరం లేదని..ఇప్పుడు పరిస్థితుల్ని చూస్తే ఎవరైనా జైల్లో పెట్టగలరని పేర్కొన్నారు. అలాగే జైలు నుంచి రిలీజైన తర్వాత జరిగిన ర్యాలీలో తాను పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు.
జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాము రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ద్రోహం చేయడంతో టీడీపీలోకి వచ్చామని.. ఆ పార్టీలోనే కొనసాగుతామని స్ఫష్టం చేశారు. పార్టీ మారే ఆలోచన లేదని, ఎవరో ఏదో అనుకుంటే వాటన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Also Read : ఎమ్మెల్యే శ్రీదేవి గొప్ప మనసు : గాయపడ్డ వ్యక్తికి రోడ్డుపైనే ప్రాథమిక వైద్యం