Mamatabenarjee on BJP approach in Bengal: బెంగాల్లో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ కలలు కంటోందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. టీఎంసీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. మమతా బంకురా జిల్లాలో నిర్వహించిన ర్యాలీ పాల్గొని మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బులను ఎరగా చూపుతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం కలే అని ఎద్దేవా చేశారు.
తిరిగి అధికారాన్ని చేపడతాం…
వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేతలు టీఎంసీ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారని, భాజపాకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు జైలు నుంచే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తీరుతానని అన్నారు. ఈ సందర్భంగా బీహార్‌లో ఎన్‌డీఏ గెలుపుపై కామెంట్ చేస్తూ… బీజేపీ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ను జైలులో పెట్టినప్పటికి ఆ పార్టీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందని అన్నారు. కాగా, గత కొంత కాలంగా మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై పోరు సాగిస్తూనే ఉంది.
పలు సందర్భాల్లో మమతా బెనర్జీ సైతం కేంద్ర సర్కారు నిర్ణయాలను తప్పుపట్టారు. వచ్చే ఏడాదిలో బెంగాల్‌లో సాధారణ ఎన్నికలు ఉండడంతో ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బెంగాల్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ మరోసారి బీజేపీతో పోరాడుతానని ఎన్నికల పోరును ముందే ప్రారంభించారు. అయితే పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి ఏడాది కాలంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలుసార్లు టీఎంసీ నేతలు, బీజేపీ శ్రేణులు పరస్పర దిగారు. దీంతో రానున్న ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్నాయి.