చాలా ఏళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడు ఉగ్రవాదుల తూటాల ధ్వనులు, భద్రతా దళాల, బూట్ల చప్పుడుతో ఉండే ప్రాంతాలు పార్టీల నేతల నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. ముఖ్యంగా శ్రీనగర్ జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల నేపథ్యంలో నేతల బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో జమ్మూ-కశ్మీర్ కోలాహలంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.
శ్రీనగర్ డీడీసీ ఎన్నికలను ఈ నెల 28 నుంచి డిసెంబరు 22 వరకు 8 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీల మేనిఫెస్టోలను మైకులతో హోరెత్తిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, జితేంద్ర సింగ్, అనురాగ్ ఠాకుర్ సహా అగ్ర నేతలను భాజపా ప్రచారంలోకి దింపింది. కాంగ్రెస్ మాత్రం స్థానిక నేతలతోనే ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీడీసీ ఎన్నికల్లో తమ కూటమి తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తెలిపారు. దీంతో ఒక్కసారిగా కశ్మీర్ మంచుకొండల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.