దుబ్బాకలో కాంగ్రెస్ పతనానికి కారణాలు ఎన్నో…

దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య తొలుత దోబూచులాడిన అధిక్యత టెన్షన్ పెంచింది.

దుబ్బాకలో కాంగ్రెస్ పతనానికి కారణాలు ఎన్నో...
Follow us

|

Updated on: Nov 10, 2020 | 7:31 PM

దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య తొలుత దోబూచులాడిన అధిక్యత టెన్షన్ పెంచింది. చివరికి భారతీయ జనతాపార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయబావుట ఎగురవేశారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పుని కోరుకున్నారని అర్ధం అవుతుంది. ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ కంటే బిజెపినే ప్రజలు ఎక్కువగా నమ్మారు. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కుమ్ములాటలని ప్రజలు హర్షించలేదు. అందుకే కాంగ్రెస్ కంటే బిజెపిని నమ్ముతూ ఎన్నిక ఏకపక్షం కాకుండా చూసుకున్నారు.

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు దుబ్బాకలో కాంగ్రెస్‌ పరిస్థితికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గతంలో రెండో స్థానంలో ఉన్న హస్తం పార్టీ ఈసారి పూర్తిగా చేతులెత్తేసింది. ఎక్కడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు. బీజేపీ,టీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫైట్‌ నడిస్తే… ఆటలో అరటిపండులా కాంగ్రెస్‌ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థియే కరువైనట్లు రెండు రోజుల ముదు పార్టీలో చేరిన వ్యక్తిని బుజాన వేసుకుని ఊరేగింది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం.

నామినేషన్ల గడువు ముగియడానికి సరిగ్గా రెండు రోజుల ముందు మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అప్పటి వరకు టీఆర్ఎస్ లో టిక్కెట్‌ వస్తుందని ఆశించిన వ్యక్తి.. టికెట్ దక్కపోయేసరికి పార్టీ ఫిరాయించేశారు. తన తండ్రి ముత్యంరెడ్డి పేరు చెప్పుకుని ప్రచారం మొదలుపెట్టాడు. అదెక్కడా ఫలితాలను ఇవ్వలేదు. అతికష్టం మీద డిపాజిట్ దక్కించుకున్నాడు. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి 23 రౌండ్లలో ఆ పార్టీకి 21 వేల 961 ఓట్లు మాత్రమే దక్కాయి.

మరోవైపు, మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్‌. తొగుట మండలంలో అంతో ఇంతో సత్తా చాటే ప్రయత్నం చేసింది. వేములఘాట్‌లో మాత్రమే కాంగ్రెస్‌కు ఆధిక్యత వచ్చింది. 12వ రౌండ్‌లో మాత్రం ఆ పార్టీ 83 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ముంపు గ్రామాలైన ఏటిగట్టుకిష్టాపూర్‌లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటితే, పల్లెపహాడ్‌లో బీజేపీ ఆధిక్యాన్ని చాటుకుంది. నిర్వాసితుల పక్షాన మొదటి నుంచి పోరాటం చేసిన కాంగ్రెస్‌… దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోలేక చతికిలాపడిపోయింది.

నామినేషన్ల గడువుకు ముందే అభ్యర్థిని ప్రకటించడం, ఆ తర్వాతే ప్రచారం మొదలు పెట్టడం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లలేకపోయారు. అన్ని ఊళ్లకు వెళ్లి ప్రజలను కలవలేదు. పైగా సీనియర్‌ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు తమ అభ్యర్థికి సహకరించలేదు. కొందరు నేతలు మాత్రమే క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు.

నేతలంతా దుబ్బాకలోనే మకాం వేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆదేశించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆఖరికి టిపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సైతం విస్తృతంగా ప్రచారం చేయలేకపోయారనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. మరోవైపు, సంస్థాగతంగా పార్టీ బలంగా లేకపోవడం, గ్రామాల్లో సరైన లీడర్లు లేకపోవడం పార్టీకి మైనస్‌గా మారింది. ఎవరు ఎక్కడ ప్రచారం చేశారనే దానిపై అయోమయ పరిస్థితి నెలకొంది. మరోవైపు, కీలక నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడం పార్టీకి మరింత ఇబ్బందిగా మారింది.

మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి, సీటు ఆశించిన వెంకట నర్సింహారెడ్డి, మరో కీలక నేత మనోహర్‌ సైతం గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో గ్రామాల్లో కాంగ్రెస్‌కు నాయకుడే కరువయ్యారు. చివరకు… గత రెండుసార్లు రెండో స్థానంలో నిలిచిన ఆ పార్టీ ప్రస్తుతం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో వచ్చిన ఓట్లను కూడా సాధించుకోలేకపోయింది.

పోలింగ్‌కి ముందు జరిగిన డబ్బులాటతో కాంగ్రెస్‌ సైడ్‌ అయిపోయింది. ఓటర్ల దృష్టంతా టీఆర్‌ఎస్‌, బీజేపీ మాటల యుద్ధం వైపే మళ్లింది. సవాళ్లు కూడా ఆ రెండు పార్టీల మధ్యే నడిచింది. చివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్‌కు ఉన్న ఓట్‌ బ్యాంక్‌ అంతా బీజేపీకి మళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓట‌మిపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశ‌ప‌డొద్దు. మరింత ఉత్సాహంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 2023 టార్గెట్ గా పనిచేయాలని కాంగ్రెస్ నేతలు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుని ప్రజల దృష్టిని మళ్లించి ఎన్నికల సరళిని మార్చేశారు. కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని హితబోధ చేస్తున్నారు.