వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే ఫోన్‌ను కాపాడుకోవచ్చు
వర్షంలో మొబైల్ ఫోన్ తడవడం లేదా నీటిలో పడిపోవడం సాధారణమే. అయితే అలాంటి సమయంలో వెంటనే ఫోన్‌ను ఆన్ చేయడం లేదా ఛార్జింగ్ పెట్టడం వంటి పొరపాట్లు చేయకూడదు. ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం, సిమ్ ట్రే తొలగించడం, పూర్తిగా ఆరనివ్వడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటర్ డ్యామేజ్‌ను తగ్గించి, ఖరీదైన మరమ్మతులను నివారించే అవకాశం ఉంటుంది..

వర్షాకాలంలో వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా, భారీ వర్షాల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వర్షంలో తడవడం లేదా అనుకోకుండా నీటిలో పడిపోవడం సాధారణమే. అలాంటి సమయంలో చాలామంది ఆందోళనకు గురై వెంటనే ఫోన్‌ను ఆన్ చేయడం లేదా ఛార్జింగ్ పెట్టడం వంటి పొరపాట్లు చేస్తుంటారు. ఇవి ఫోన్‌కు మరింత నష్టం కలిగించే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ నీటిలో తడిసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, ఖరీదైన మరమ్మతులను నివారించే అవకాశం ఉంటుంది.
వెంటనే ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలి
ఫోన్ తడిసిన వెంటనే దానిని స్విచ్ ఆఫ్ చేయాలి. తడిగా ఉన్న సమయంలో ఫోన్ ఆన్‌లో ఉంటే షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మదర్‌బోర్డ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
సిమ్ ట్రే, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ తొలగించాలి
ఫోన్‌ను ఆఫ్ చేసిన తర్వాత సిమ్ ట్రే, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ ఉంటే వాటిని బయటకు తీసేయండి. ఇలా చేయడం వల్ల ఫోన్ లోపల గాలి ప్రసరించి తేమ త్వరగా ఆరే అవకాశం ఉంటుంది.
పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి
శుభ్రమైన పొడి కాటన్ గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో ఫోన్‌పై ఉన్న నీటిని పూర్తిగా తుడవండి. అయితే హెయిర్ డ్రైయర్‌తో వేడి గాలి ఉపయోగించకండి. అధిక వేడి ఫోన్‌లోని సున్నితమైన భాగాలకు హాని కలిగించడంతో పాటు నీటిని మరింత లోపలికి నెట్టే అవకాశం ఉంది.
తేమను ఆరనివ్వాలి
ఫోన్‌ను పూర్తిగా ఆరేందుకు సమయం ఇవ్వండి. కొందరు బియ్యంలో ఫోన్‌ను ఉంచుతారు, అయితే ఈ పద్ధతి అన్ని సందర్భాల్లో ప్రభావవంతమని నిర్ధారించబడలేదు. సాధ్యమైనంత వరకు పొడి ప్రదేశంలో ఫోన్‌ను ఉంచి పూర్తిగా ఆరనివ్వడం మంచిది.
వెంటనే ఛార్జింగ్ పెట్టవద్దు
ఫోన్ బాగా తడిసినట్లయితే కనీసం 48 గంటల వరకు ఛార్జింగ్‌కు పెట్టకండి. తడిగా ఉన్న ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్, బ్యాటరీ లేదా ఇతర హార్డ్‌వేర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
వెంటనే ఆన్ చేయడానికి ప్రయత్నించవద్దు
ఫోన్ తడిసిన వెంటనే పదేపదే ఆన్ చేసి పనిచేస్తుందో లేదో పరీక్షించకండి. కనీసం 48 నుంచి 72 గంటలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఫోన్‌ను ఆన్ చేసి పరిశీలించడం మంచిది.
మీ ఫోన్‌కు IP67 లేదా IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉన్నా కూడా, ఎక్కువసేపు నీటిలో ఉండటం లేదా ఉప్పునీరు, సబ్బు నీరు వంటి ద్రవాలు తగలడం వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది. ఫోన్ పూర్తిగా ఆరిన తర్వాత కూడా పనిచేయకపోతే లేదా ఛార్జింగ్ సమస్యలు కనిపిస్తే, స్వయంగా విడదీయడానికి ప్రయత్నించకుండా అధికారిక సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం.




