Dog Houses In Ghaziabad: చలికి తడుస్తూ, ఎండకు ఎండుతూ రోడ్లపై తిరిగే వీధి కుక్కలను చూస్తే జాలేస్తుంది. అయితే రోడ్లపై తిరిగే కుక్కలను చూసి వీలైతే ఓ బిస్కెట్ వేస్తాం.. లేదంటే జాలి పడి అక్కడి నుంచి వెళ్లి పోతాం. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ మాత్రం దానికి భిన్నంగా స్పందించింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రామ్‌ప్రస్థ్ గ్రీన్స్ వీధి కుక్కలకు ఆశ్రయాన్ని కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఆ సంస్థకు చెందిన 100 ఎకరాల స్థలంలో కుక్కల కోసం ఏకంగా డాగ్ హౌజ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో కుక్కలు చలికి తట్టుకునేలా దుప్పట్లను అందుబాటులో ఉంచింది. ఇప్పటి వరకు 80 వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించడంతో పాటు వాటికి అయ్యే తిండి ఖర్చు అంతా రామ్‌ప్రస్థ్ గ్రీన్స్ భరిస్తోంది. ఇక ఈ సొసైటీలోని సభ్యులు కూడా శునకాల సంరక్షణకు తమవంతు నగదు, సరుకుల సహాయం చేస్తున్నారు. రామ్ ప్రస్థ్ గ్రూప్ జనరల్ మేనేజర్ భాస్కర్ గాంధీ ఈ విషయమై మాట్లాడుతూ.. వీధి కుక్కల సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకే తాము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు చెప్పారు.