విజయనిర్మల పుట్టినిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంత, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ నివాసం ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచిపోయింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. కొద్ది కాలం తర్వాత విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి మద్రాస్ వెళ్లిపోయారు. 7 ఏళ్ల వయసు ఉన్నప్పడు పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. బాలనటిగా ఉన్నప్పుడు సినిమాల్లో ఎక్కువగా మగవేషాలు వేశారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిసుబుక్‌లో ఎక్కారు.