ఆసు యంత్రాన్ని తయారుచేసి చేనేత కార్మికుల కష్టాలను తగ్గించిన చింతకింది మల్లేశం అభినందనీయుడని కొనియాడారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మల్లేశం జీవిత కథను ఆధారంగా తీసిన ‘మల్లేశం’ చిత్ర యూనిట్‌ను అభినందించారు. చాల మంచి ప్రయత్నం చేసారంటూ చిత్ర దర్శకుడు రాజ్‌ను అభినందించారు. ఫేస్‌బుక్‌లో మల్లేశం సినిమా గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు.
ఈ చిత్రంలో నటించినవారంతా తమ పాత్రలకు ప్రాణం పోశారన్నారు రాఘవేంద్రరావు. మల్లేశం సినిమా ఓ ప్రయోజనాత్మక చిత్రమని,ఇది ఎందరో చేనేత కార్మికుల కష్టాలకు ప్రతిరూపమంటూ వ్యాఖ్యానించారు. ఆసు యంత్రం తయారుచేసి ఎందరో చేనేత కార్మికులకు కష్టాన్ని తగ్గించిన చింతకింది మల్లేశానికి తన వంతుగా నాలుగు యంత్రాలు తయారీకి రూ. లక్ష విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు దర్శకేంద్రుడు.