భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలిస్తే ఖంగు తినాల్సిందే..!
Diamond Dust: ఒకప్పుడు అరుదుగా మాత్రమే సంభవించే వరదలు, ఇతర వాతావరణ వైపరీత్యాలు ఇప్పుడు తరచుగా సంభవిస్తున్నాయి. ఇందుకు పెరిగిపోతున్న భూతాపమే కారణమని శాస్త్రవేత్తలే కాదు, సామాన్యులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇకపై భూతాపం పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశాలపై ప్రపంచ దేశాధినేతలు సదస్సులు పెట్టుకుని మరీ లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు.
ఇంత వరకు ఓకే.. కానీ ఇప్పటికే పెరిగిపోయిన భూతాపం సంగతేంటి? అన్న ప్రశ్న తలెత్తకమానదు. భూమిపై పెరిగిపోయిన ఉష్ణోగ్రతలను తగ్గించడం కోసం పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు ఒక మార్గం కనుగొన్నారు. అదే డైమండ్ డస్ట్ (వజ్ర ధూళి). అవును.. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా సరే.. ఇదే పర్యావరణానికి, భూమ్మీద జీవరాశులకు హాని కల్గించని ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు.
భూతాపం పెరిగితే ఏమవుతుంది?
సౌర కుటుంబంలో ఏ గ్రహంపై లేని జీవజాలం భూమ్మీద ఉందంటే అందుకు కారణం ఇక్కడ జీవుల మనుగడకు అనువైన వాతావరణం ఉండడమే. అలాంటి వాతావరణాన్ని మానవులు తమ అవసరాల కోసం, స్వార్థం కోసం విధ్వంసం చేస్తూ భూతాపం పెరగడానికి కారణమవుతున్నారు. పారిశ్రామిక విప్లవం తొలినాళ్ల నుంచి భూమి సగటు ఉష్ణోగ్రతలు (భూతాపం) పెరగడం మొదలైంది. దీని భూ ఉపరితల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడే తుఫాన్లు, రుతుపవనాల్లోనూ తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా అధిక వర్షాలు, వరదలు, తీవ్రమైన తుఫాన్లు, టోర్నడోలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు కార్చిచ్చులు, హీట్ వేవ్ పరిస్థితులు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. అలాగే వాటి తీవ్రత కూడా నానాటికీ పెరుగుతూ పోతోంది. ఇవి భూమ్మీద తీవ్రమైన విధ్వంసాలను సృష్టిస్తూ భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు కల్గిస్తున్నాయి. రుతుపవనాల ఆధారిత భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో సంభవించిన వరదలు, తుఫాన్లు.. అవి సృష్టించిన విలయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగా సృష్టించే విధ్వంసానికి తోడు, పరోక్షంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒక నెల రోజుల పాటు పరిమిత మోతాదులో నమోదు కావాల్సిన వర్షపాతం ఒకట్రెండు రోజుల్లోనే నమోదవుతోంది. ఇంకా చెప్పాలంటే కొన్ని గంటల వ్యవధిలోనే అతి భారీ వర్షాలు కురిసి గతంలో ఎన్నడూ చూడని వరదలకు ఆస్కారమిస్తున్నాయి. లేదంటే తీవ్రమైన కరవు పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇది యావత్ మానవాళి ఆహార భద్రతకు పెను ముప్పుగా మారుతోంది. అందుకే 2015లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాలు సమావేశమై భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగకుండా కట్టడి చేయాలని తీర్మానించుకున్నాయి. మరి ఇది సాధ్యపడిందా అంటే.. ఇప్పటికే 1.5 డిగ్రీలను దాటి భూతాపం పెరిగిపోయిందని తాజాగా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ వాయువులే భూతాపానికి కారణం
భూ వాతావరణంలో గ్రీన్ హౌజ్ గ్యాసెస్‌గా పేరొందిన కార్పన్ డై ఆక్సైడ్ (CO2), మీథేన్ (CH4), నైట్రస్ ఆక్సైడ్ (N2O) వంటి వాయువులు తగు మోతాదులో ఉండడం చాలా అవసరం. లేదంటే ఇతర గ్రహాల మాదిరిగా సూర్యరశ్మి లేని సమయంలో అత్యంత శీతల పరిస్థితి (మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత) ఏర్పడుతుంది. అయితే ఈ వాయువులు ప్రకృతి సహజసిద్ధంగా వాతావరణంలో చేరడాన్ని ఎవరూ నియంత్రించలేరు. కానీ మనిషి రోజువారీ అవసరాల కోసం వీటిని వాతావరణంలోకి యథేచ్ఛగా విడుదల చేయడమే ఇప్పుడు ముప్పు తెచ్చిపెడుతోంది.
ఉదాహరణకు కార్బన్ డై ఆక్సైడ్ (CO2) అగ్నిపర్వతాల విస్ఫోటనం, జీవరాశులు, చెట్లు శ్వాసించడం కారణంగా వాతావరణంలోకి వచ్చి చేరుతుంది. అదే సమయంలో అడవుల్లోని పచ్చని చెట్లు జరిపే కిరణ జన్య సంయోగ క్రియ ఆ కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌గా మార్చుతుంది. అలా ప్రకృతి విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను ప్రకృతే సమతూకం పాటించేలా చేస్తుంది. కానీ మానవాళి కారణంగా విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ మాత్రం మళ్లీ తిరిగి ఆక్సిజన్‌గా మారడం లేదు. ఎందుకంటే ఆక్సిజన్‌గా మార్చాల్సిన చెట్లనే మనిషి నరికేసి అడవుల విస్తీర్ణాన్ని ప్రమాదకర స్థాయిలో తగ్గించేశాడు. ఆధునిక యుగంలో కర్బన ఇంధనాలు (పెట్రోల్, డీజిల్, బొగ్గు) మండిస్తూ వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయులను మరింత పెంచుతున్నాడు. వీటితో పాటు పరిశ్రమల పొగ గొట్టాల నుంచి విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌తో పాటు మరిన్ని రకాల గ్రీన్ హౌజ్ వాయువుల సంగతి తెలిసిందే. వీటి కారణంగానే భూమి సగటు ఉష్ణోగ్రతలు 1850-1900తో పోల్చితే గణనీయంగా పెరిగాయి. పారిస్‌లో జరిగిన సదస్సు (COP 21)లో ఈ సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగకుండా కట్టడి చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఆ పరిమితిని దాటి భూతాపం పెరిగిందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అలా పెరగకుండా చేయాలంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల వాడకాన్ని తగ్గించి, వాటి స్థానంలో పునరుత్పాతక ఇంధన వనరులైన సౌర శక్తి, పవన విద్యుత్తు, జల విద్యుత్తు వంటివాటిని ఉపయోగించాలి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాలకు బదులుగా కాలుష్య ఉద్గారాలు వెదజల్లని విద్యుత్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ వాహనాలను వినియోగించాలి. కానీ ఇదంతా రాత్రికి రాత్రే జరిగే పని కాదు. అందుకే కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని, ప్రణాళికబద్ధంగా కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించాల్సి ఉంటుంది. మరోవైపు కృత్రిమంగా అడవులను పెంచుతూ వాటి విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా కొంతమేర కార్బన్ డై ఆక్సైడ్ స్థాయులను తగ్గించవచ్చు. భూగోళంపై సముద్రాల విస్తీర్ణం ఎక్కువ కాబట్టి, సముద్ర జలాల్లో పెరిగే ‘ఫైటోప్లాంక్టన్’ తరహా స్వయం పోషక కాంపొనెంట్ల పెరుగుదలకు ఆస్కారం కల్గిస్తే.. అవి చెట్ల మాదిరిగా కిరణ జన్య సంయోగ క్రియ జరిపి వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను భారీ స్థాయిలో గ్రహించి ఆక్సీజన్‌గా మార్చుతాయి. భూ వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ను ఆధునిక పద్ధతుల్లో సేకరించి.. వాతావరణంలోకి తిరిగి కలవకుండా ఇతర అవసరాల కోసం వినియోగించడం లేదా భారీగా నిల్వ చేయడం వంటివి కూడా శాస్త్రవేత్తలు సూచించే ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి.
ఇదంతా కేవలం కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించడం ఎలా అన్న ప్రశ్నకు వచ్చే సమాధానాలు మాత్రమే. కానీ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి సహజ సిద్ధ వాయువులతో పాటు మనిషి సౌఖ్యం కోసం వినియోగించే ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ కూడా భూతాపం పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి కూడా శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయాలు, మార్గాలు సూచిస్తున్నారు.
నియంత్రణ సరిపోదు.. తగ్గించే మార్గం చూడాలి
ఇకపై భూతాపం పెరగకుండా నియంత్రించేందుకు మార్గాలున్నాయి. కానీ ఇప్పటికే పెరిగిన భూతాపం సంగతేంటి అన్న ప్రశ్న తలెత్తితే.. ఇందుక్కూడా అవకాశం ఉందని, కాకపోతే ఖర్చే భరించలేనంత అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ ఉపరితల వాతావరణంలో ‘స్ట్రాటోస్పియర్’లో ప్రతియేటా 5 మిలియన్ టన్నుల డైమండ్ డస్ట్ (వజ్ర ధూళి)ని వెదజల్లితే.. రానున్న 45 ఏళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.6 డిగ్రీల మేర తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. వజ్రాలను సానబెట్టే క్రమంలో డైమండ్ డస్ట్ ఏర్పడుతుంది. వజ్రాలు భూమ్మీద దొరికే అరుదైన వస్తువు. అలాంటి వజ్రాల ధూళి ప్రతియేటా 5 మిలియన్ టన్నులు సేకరించడం సాధ్యపడుతుందా అన్నదే సందేహం. ఒకవేళ సేకరించగలిగినా.. అందుకు 200 ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక ట్రిలియన్ డాలర్లు అంటేనే భారత కరెన్సీలో అటూ ఇటుగా రూ. 85 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి.
ఒకవేళ అంత ఖర్చుపెట్టి వజ్రధూళిని సేకరించి స్ట్రాటోస్పియర్‌లోకి పంపితే.. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా భూతాపాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే వజ్రధూళి సల్ఫర్ డైఆక్సైడ్ మాదిరిగా ఆమ్ల వర్షాలు (Acid Rains) కురిపించదు. ఓజోన్ పొరను దెబ్బతీయదు. ఇంకా చెప్పాలంటే సూర్యకాంతిని ఫిల్టర్ చేసి వెనక్కి పంపుతూ తద్వారా భూమికి చేరే వేడిని కూడా చాలా వరకు వెనక్కి పంపుతుంది. అంటే ఈ వజ్రధూళి భూమి చుట్టూ కనిపించని ఒక అద్దంలా పనిచేస్తుందన్న మాట.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి