AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ క్యాపిటల్స్… ఈసారైనా చరిత్రను తిరగరాస్తుందా.!

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఐపీఎల్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టు అని చెప్పాలి. ఈ జట్టులో ఎంతోమంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా కూడా.. ట్రోఫీ గెలవాలనే కల ఇంకా వాళ్ళకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

ఢిల్లీ క్యాపిటల్స్... ఈసారైనా చరిత్రను తిరగరాస్తుందా.!
Ravi Kiran
|

Updated on: Sep 11, 2020 | 8:33 PM

Share

Delhi Capitals Team: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఐపీఎల్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టు అని చెప్పాలి. ఈ జట్టులో ఎంతోమంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా కూడా.. ట్రోఫీ గెలవాలనే కల ఇంకా వాళ్ళకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సమిష్టి ప్రదర్శన కరువై వరస ఓటములతో ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ రికార్డులు లేని ఈ జట్టు 2019లో మాత్రం ప్లేఆఫ్స్ చివరి వరకు వెళ్ళింది. ఇక ఈ ఏడాది ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవడానికి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒకసారి వాళ్ళ బలం, బలహీనతలను చూద్దాం.

అసలు ఢిల్లీ జట్టు పూర్వ వైభవం గురించి మనం చూస్తే.. 2019 వరకు ఒక లెక్క.. గతేడాది ఒక లెక్క అని చెప్పొచ్చు. గతేడాది ముందు వరకు కేవలం మూడుసార్లు మాత్రమే టాప్ 4లో నిలిచిన ఢిల్లీ జట్టు.. 2019లో అంచనాలను దాదాపుగా అందుకుంది. కానీ ప్లేఆఫ్స్‌లోనే వెనుదిరిగింది. ఇక ఈసారి గతేడాది జరిగిన పొరపాట్లను పునరావృత్తం కాకూడదని వ్యూహాలు రచిస్తోంది.

బలం:

ఢిల్లీ జట్టులో అటు మెరుగైన యువ క్రికెటర్లు, ఇటు సీనియర్ ఆటగాళ్లు పుష్కలంగా ఉన్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, సందీప్ లామిచాన్ వంటి యువ క్రికెటర్స్.. శిఖర్ ధావన్, అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫినిషర్స్ కు కొదవు లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఈ జట్టులో ఉన్నారు. గత సీజన్ లో అదరగొట్టిన పంత్, భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్, అజింక్య రహానేలపై ఈ జట్టు భారీ ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. ఇక ఢిల్లీ జట్టులోకి ఈ ఏడాది వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ అనుభవం యువ బౌలర్లకు చాలా ఉపయోగపడుతుంది.

బలహీనతలు:

ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానేల రూపంలో ఓపెనర్స్ శుభారంభాన్ని ఇచ్చినా.. ఢిల్లీకి మిడిలార్డర్ పెద్ద ఇబ్బందిగా మారింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు.. కొత్తగా టీమ్ లోకి వచ్చిన హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్ ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. ఒకవేళ వాళ్లు అంచనాలకు తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఢిల్లీకి టైటిల్ వేట సుగమమే.

అవకాశాలు:

ఐపీఎల్ లో అండర్ డాగ్ గా బరిలోకి దిగుతున్న ఢిల్లీ జట్టుకు రికీ పాంటింగ్ ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడితే ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ గెలుస్తుందని అంచనా. మరి చరిత్ర తిరగరాస్తుందా.? లేదా అనేది చూడాలి.