చలి చంపుతోంది. తెలుగురాష్ట్రాల్లో క్రమంగా చలిపంజా విసురుతోంది. ఈశాన్యగాలులు, అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. సముద్రం నుంచి కోస్తాపైకి గాలులు వీస్తుండడంతో వాతావరణం మారింది. వికారాబాద్ జిల్లా మార్పల్లిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం రికార్డుగా భావిస్తున్నారు అధికారులు. వికారాబాద్ జిల్లాలోనే మోమిన్‌పేట్, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కూడా 7.2గా నమోదుకాగా.. జహీరాబాద్, న్యాల్‌కల్‌లో 7.8, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8.1, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, తాంసిలలో 8.5 డిగ్రీలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణి ఎఫెక్ట్‌తో ఇలాగే తేమగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో చలికి తోడు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. దక్షిణకోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. అనేక చోట్ల ముసురు కమ్ముకుంది. ఒక్కరోజులోనే ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు తగ్గాయి. అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు పడిపోగా.. కృష్ణాజిల్లా నందిగామలో 15, కర్నూలు, కడపలో 18 డిగ్రీలుగా నమోదయ్యాయి. చలి పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. వింటర్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అన్‌లాక్ కొనసాగుతుండడంతో జన సంచారం పెరిగింది. కొంతమంది ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. ఇప్పటికే కేసులు.. పెరుగుతున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read :
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా
నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !