ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు, స్టాండింగ్ కమిటీ భేటీలో బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్, కీలక రోడ్ల విస్తరణకు ఓకే
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు..
Crucial decision by GHMC committee: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుండి సరూర్ నగర్ మెయిన్ రోడ్ వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును 30 మీటర్లకు విస్తరణ సందర్భంగా 350 ఆస్తుల సేకరణతో పాటు పరిపాలన సంబంధిత మరో రెండు తీర్మానాల ఆమోదంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను గురువారం ప్రవేశపెట్టారు. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు గంధం జోత్న్స, మీర్ బాసిత్ అలీ, సామ స్వప్న, మిర్జా ముస్తఫా బేగ్, సున్నం రాజ్‌మోహన్, మహ్మద్ నజీరుద్దీన్, ముఠా పద్మనరేష్, కొలను లక్ష్మి, వి.సింధు, సబితా కిషోర్, ఏ.అరుణ, అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, జాయింట్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.
# 2021- 21 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్ వివరాలు #
* 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,600 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించారు.
* ఈ ప్రతిపాదిత అంచనా బడ్జెట్ లో అత్యధికంగా 32 శాతం ఆస్తిపన్ను ద్వారా రూ. 1850 కోట్లు వస్తుందని అంచనా.
* 22 శాతం నిధులు రూ. 1224.51 కోట్లు రుణాల ద్వారా రానున్నాయి.
* 17శాతం నిధులు రూ. 1022.70 కోట్లు ఫీజులు, యూజర్ చార్జీల కింద రానున్నాయి.
* 14 శాతం నిధులు రూ. 770.51 కోట్లు ప్లాన్ గ్రాంట్ల కింద రానున్నాయి.
* 13 శాతం నిధులు రూ. 652.10 కోట్లు అసైండ్ రెవెన్యూ కింద రానున్నాయి.
* 3 శాతం నిధులు రూ. 189.69 కోట్లు క్రమబద్దీకరణ ఫీజుల కింద లభించనున్నాయి.
* ఒక శాతం నిధులు రూ. 66.20 కోట్లు ఇతర రెవెన్యూ మార్గాల ద్వారా లభించనున్నాయి.
* రూ. 22.84 కోట్లు కాంట్రిబ్యూషన్ ద్వారా లభించనున్నాయి.
ఈ ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలో వ్యయం అయ్యే వివరాలు…
* 28 శాతం నిధులు రూ. 1582.51 కోట్లు రోడ్లు, పేవ్ మెంట్ నిర్మాణాలకు వ్యయం
* 22 శాతం నిధులు రూ. 1226.91 కోట్లు ఎస్టాబ్లిష్ మెంట్ వ్యయం
* 16 శాతం నిధులు రూ. 905.30 కోట్లు ఆపరేషన్స్, మెయింటనెన్స్ వ్యయం
* 10 శాతం నిధులు రూ. 560 కోట్లు గ్రీన్ బడ్జెట్
* 8 శాతం నిధులు రూ. 445.19 కోట్లు ల్యాండ్ ఇంప్రూవ్ మెంట్ కొరకు
* 6 శాతం నిధులు రూ. 281.79 కోట్లు ఇతర రెవెన్యూ వ్యయం
* 5 శాతం నిధులు రూ. 296.43 కోట్లు ఇతర క్యాపిటల్ వ్యయం
* 3 శాతం నిధులు రూ. 170 కోట్లు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం
* 2 శాతం నిధులు రూ. 131.87 కోట్లు మంచి నీటి సరఫరా, సీవరేజ్ నిర్వహణకు
2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 5380 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించగా దీనిని రూ. 5,500 కోట్లుగా సవరిస్తూ ప్రతిపాదించారు.