వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యువకులు రక్తసంబంధీకులనే కాదనుకుంటున్నారు. జులాయి పందాలకు అలవాటుపడి కుటుంబసభ్యుల ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు. దాచుకున్న సొమ్ముతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడవద్దని పాపానికి కన్నతల్లిని.. సొంత చెల్లిని పొట్టన పెట్టుకున్నాడో కిరాతకుడు. అన్నంలో మత్తు బిళ్లలు కలిపి ఇద్దరినీ కడతేర్చాడు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటినుంచి భార్య సునీత(42), కుమారుడు సాయినాథ్‌రెడ్డి, కుమార్తె అనూషలు కలిసి జీవిస్తున్నారు. సునీత ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, సాయినాథ్‌రెడ్డి ఎంటెక్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అనూష బీఫార్మసీ చదువుతోంది. ప్రభాకర్‌రెడ్డి మృతిచెందిన సమయంలో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు, భూమి అమ్మకం సొమ్ము కలిపి సుమారు రూ.20 లక్షలు బ్యాంకులో దాచారు. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో ఒక్కసారి క్రికెట్ బెట్టింగ్ చిచ్చుపెట్టింది.
ఇదిలావుంటే, ఇటీవల సాయినాథ్‌రెడ్డి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు భారీ మొత్తంగా పందాలు కాయడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున నష్టపోయాడు. తన తల్లికి తెలియకుండా బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రా చేసి మరీ, బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు. అంతేకాదు, ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను సైతం తీసుకెళ్లి, వాటిని అమ్మి బెట్టింగ్‌లకు పాల్పడే ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కుమారుడిని నిలదీసింది. ఈనేపథ్యంలో తన తల్లిని, చెల్లిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇదే క్రమంలో ఈ నెల 23న ఇంట్లో వండిన రాత్రి భోజనంలో రసాయన గుళికలు కలిపి విధులకు వెళ్లాడు. ఈ విషయం తెలియని అమాయకపు తల్లి, చెల్లి తమకు కడుపులో తిప్పినట్లుగా ఉందని.. నువ్వు తీసుకెళ్లిన అన్నం తినవద్దని ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్న సాయినాథ్‌రెడ్డి వారిని అపస్మారక స్థితికి చేరే వరకు ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. తర్వాత ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 27న చెల్లెలు అనూష, 28న తల్లి సునీత మరణించారు. అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు సాయినాథ్‌రెడ్డిని నిలదీయగా నిజం ఒప్పుకున్నాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.