ఢిల్లీలో గత 24 గంటల్లో వెయ్యి కన్నా తక్కువగానే..అంటే సుమారు 960 కోవిద్ కేసులు నమోదయ్యాయి. 10 వారాల అనంతరం ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. రోజువారీ కేసులు తగ్గుతున్నందున ఆంక్షలను మరింతగా సడలిస్తామని, మరిన్ని కార్యకలాపాలను అనుమతిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మొదట నిర్మాణ, ఉత్పాదక రంగాలను పునరుద్ధరిస్తామని ఆయన నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 తో లాక్ డౌన్ ముగుస్తోంది. ఇక ఆన్ -లాక్ ప్రక్రియ మొదలవుతుందని రానున్న వారాల్లో కేసులు ఇంకా తగ్గిన పక్షంలో అన్-లాక్ ప్రక్రియమీద మరింత దృష్టి పెడతామని, క్రమంగా అన్ని కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నగరంలో లాక్ డౌన్ ని నిరంతరం పొడిగిస్తునందున తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వ్యాపార సంఘాలు ఆందోళన వెలిబుచ్చగా అయన ఈ హామీనిచ్చారు. త్వరలో అన్-లాక్ కు అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా ఛత్రపాల్ స్టేడియంలో శనివారం ఆయన డ్రైవ్ త్రూ కోవిద్ వ్యాక్సినేషన్ సెంటర్ ను విజిట్ చేశారు. కార్లలోనూ, ద్విచక్రవాహనాలపైనా చివరకు నడిచి కూడా ప్రజలు ఈ సెంటర్ కు వస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సిన్ కొరత తీరగానే 18-44 ఏళ్ళ మధ్యవయస్కులకు కూడా వ్యాక్సినేషన్ మొదలు పెడతామని ఆయన పేర్కొన్నారు.
నగరానికి అవసరమైన వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు వేశామని, కానీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీలు తాము నేరుగా కేంద్రంతోనే చర్చిస్తామని స్పష్టం చేశాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రాలకు నేరుగా విక్రయించడానికి వాటికి ఎక్కడ సమస్య వస్తోందో అర్థం కావడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా తమ ప్రభుత్వం వివిధ టీకామందుల తయారీదార్లతో చర్చిస్తున్నట్టు ఆయన వివరించారు.