కరోనాకు మొదటి మందు ధైర్యమేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వడం రెండో మందుగా పేర్కొన్నారు. కరోనా బాధితులకు ధైర్యం కల్పించేలా అంతా వ్యవహరించాలని ఆయన కోరారు. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది మూడో మందు అయితే… ప్లాస్మా థెరపీ నాలుగో మందు అని చెప్పారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి పాల్గొన్నారు. ప్లాస్మా డోనర్లను అభినందించారు మంత్రులు ఈటల, మహమూద్ అలీ.
ప్లాస్మా థెరపీ ఎంతో మందికి ధైర్యం ఇచ్చిందన్న మంత్రి ఈటల.. ఈ చికిత్స ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీ చికిత్స అవసరం ఎంతో ఉందన్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేయడం ద్వారా ఇతర కరోనా పేషెంట్లకు ఎంతో మేలు చేసిన వాళ్లవుతారని అని తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానం చేసేవారికోసం ప్రత్యేకంగా రూపొందించిన donateplasma.hcsc.in వెబ్‌సైట్‌ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. తనకు కరోనా సోకిన సందర్భంలో తాను ధైర్యంగా ఉన్నానని కరోనా నుంచి కోలుకున్న మంత్రి మహమూద్ అలీ గుర్తు చేసుకున్నారు.