సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. చివ్వెంల మండలంలో విజయవాడ జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. జీ తిరుమలగిరి శివారులో శుక్రవారం సాయంత్రం ఓ కారు రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న పాల్వాయి అరుణ్ కుమార్ అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన అతని భార్య ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ గ్రామానికి చెందిన పాల్వాయి అరుణ్ కుమార్ తన భార్యా పిల్లతో కలిసి జీ తిరుమలగిరిలోని అత్తగారింటికి వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న మామను పలకరించేందుకు శుక్రవారం వచ్చారు. తిరిగి శనివారం సాయంత్రం సొంతూరుకు పయనమయ్యారు. తిరుమలగిరి శివారులోని రెండుపడక గదుల ఇండ్ల సమీపంలోకి రాగానే అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో అరుణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతని భార్య పుష్పలతను సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదివారం ఆమె మరణించింది. ఏడేండ్ల కుమారుడు, 5 సంవత్సరాల కూతురు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.