ప్రపంచాన్ని వణికిస్తున్న భూతాన్ని తరిమికొట్టేందుకు ఔషధ కంపెనీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొవిడ్-19 కట్టడిలో భాగంగా వ్యాక్సిన్ తయారీ కోసం వివిధ సంస్థలు రకరకాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు వేర్వేరుగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన సంస్థలు ఇప్పుడు రెండు వ్యాక్సిన్లను కలిపి ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్, స్పుత్నిక్ టీకాలను కలిపి క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని బ్రిటన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి నుంచి మరింత రక్షణ కల్పించేదిశగా ప్రయోగాలు చేయాలని ఆక్స్‌ఫర్డ్, స్పుత్నిక్ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. రెండు సంస్థలకు చెందిన ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి ఇవ్వనున్నారు. ఎడినోవైరస్ ఆధారంగా ఈ టీకాలను రూపొందించిన సంగతి తెలిసిందే. వేర్వేరు టీకాలు కలిపి ఇచ్చినప్పుడు రోగనిరోధక శక్తి స్పందన మరింత మెరుగ్గా ఉంటుందని ది టైమ్స్ పేర్కొంది. రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ను ఆక్స్‌ఫర్డ్‌తో కలిపి ఇచ్చేందుకు ఆస్ట్రాజెనికా అంగీకరించిందని ఆ వార్తా సంస్థ తెలిపింది.
వ్యాక్సిన్ ఉత్పత్తి పోటీలో అందరికన్నా ముందుగా రష్యాకు చెందిన స్పుత్నిక్ ప్రకటించుకుంది. ఈ వ్యాక్సిన్ ద్వారా 90% సామర్థ్యంతో పనిచేస్తుందని ట్రయల్స్ ఫలితాల్లో తేలిందని ఆ సంస్థ ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్‌ను రెండు చోట్ల పరిశీలించగా ఒకచోట 62%, మరోచోట 90% సమర్థంగా పనిచేసిందని చెప్పుకొచ్చింది. ఇక, ‘వ్యాక్సిన్ సహకారంలో కొత్త అధ్యాయం ఈ రోజే మొదలైంది. మేం చేసిన ప్రతిపాదనను ఆస్ట్రాజెనికా అంగీకరించింది’ అని స్పుత్నిక్ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ నుంచి మరింత రక్షణ కల్పించడంలో వేర్వేరు టీకాలను కలిపి ఇవ్వడం కీలకమైన ముందడుగని తెలిపింది. రెండు వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా మరింత రోగనిరోధక శక్తి పెరిగి, కరోనా వైరస్‌ను తరిమికొట్టవచ్చని అభిప్రాయపడింది.
#SputnikV uses 2 different human adenoviral vectors for 2 vaccine shots to ensure that immunity to the 1st does not make the 2nd less effective. We offered @AstraZeneca to use one of our vectors so they can also have two vectors in their vaccine. AZ confirmed. https://t.co/ft4ULcD4T5
— Sputnik V (@sputnikvaccine) December 11, 2020