కరోనా భయంతో భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య

|

Jul 17, 2020 | 7:18 PM

కరోనా పుణ్యమాని అలుమగలు సైతం దూరం చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. దూర ప్రాంతం నుంచి వచ్చిన భర్తను కరోనా భయంతో ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసింది ఆ ఇల్లాలు.

కరోనా భయంతో భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య
Follow us on

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదుపేస్తోంది. భయంతో చాలామంది ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. బయటి వ్యక్తులను ఎవరినీ దగ్గరకు రానివ్వడం లేదు. ఎవరినుంచి ఏరూపంలో వైరస్ వ్యాప్తి చెందుతుందోనన్న భయంతో అమడ దూరం నిల్చోని మాట్లాడే పరిస్థితి నెలకొంది. కరోనా పుణ్యమాని అలుమగలు సైతం దూరం చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. దూర ప్రాంతం నుంచి వచ్చిన భర్తను కరోనా భయంతో ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసింది ఆ ఇల్లాలు.

సిరిసిల్లలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజల్లో తీవ్ర భయందోళనలు నెలకొన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చినా ఇంట్లోకి రానివ్వడంలేదు. వెంకంపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బీవండి నుంచి సొంతూరుకు చేరుకున్నాడు. కానీ, అతని భార్య ఇంట్లోకి రావద్దంటూ తాళం వేసేసుకుంది. సిరిసిల్లకు చెందిన మరమగ్గాల కార్మికుడు బతుకుతెరువు కోసం కొద్దిరోజుల కిందట మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడ కరోనా తీవ్రత పెరగడంతో లాక్ డౌన్ విధించారు. దీంతో ఉపాధి కోల్పోయి సొంతూరు వెతుక్కంటూ సిరిసిల్లకు తిరిగివచ్చేశాడు. ఇంటికి వచ్చిన భర్తను భార్య అడ్డుకుంది. ఇంట్లో పిల్లలు ఉన్నందున ఇబ్బంది తలెత్తవచ్చని ఆమె ఆందోళనలు వ్యక్తం చేసింది. అదీకాక, అద్దె ఇంట్లో ఉంటున్నందున సమస్యలు రావచ్చని ఆమె 14 రోజులపాటు ఎక్కడైనా ఉండి రమ్మని తేల్చిచెప్పింది. ఇంటి గేటుకు తాళం వేసే బయటకు వెళ్లగొట్టింది. మూడు గంటల పాటు అతడు ఇంటిముందే పడిగాపులు కాయగా.. చివరికి స్థానికులు చొరవ తీసుకుని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ససేమిరా అంటూ ఇంట్లోకి రానివ్వంటూ బీష్మించి కూర్చుంది. ఇదంతా గమనించిన ఇరుగుపొరుగువారే కొద్దిపాటి డబ్బులు సర్దుబాటు చేయడంతో అతడు తిరిగి బీవండికి వెళ్లిపోయాడు. ఉపాథి కోల్పోయి సొంతూరులో కలో గంజో పంచుకుందామని వచ్చిన వ్యక్తిని తరిమేసింది ఆ మహా ఇల్లాలు.