రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకి వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలను పెంచింది. జిల్లాల వారిగా ఆస్పత్రులతో పాటు ప్రత్యేక లాబ్ ద్వారా కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అవసరమైన చోట మొబైల్ వ్యాన్ ద్వారా కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఇందుకు అనుగుణంగా అయా జిల్లా ఆస్పత్రుల్లో కరోనా కేర్ సెంటర్లను పెంచినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఎంజీఎంలో కొవిడ్ వార్డులో రోగుల సంఖ్య పెరిగిందని ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి తెలిపారు. ఆస్పత్రిలో 440 ఆక్సిజన్ కూడిన పడకలు అందుబాటులో ఉన్నాయని.. ప్రస్తుతం 130మంది కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎంతమంది రోగులు వచ్చినా చికిత్స అందిస్తామని తెలిపారు. కరోనా లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎంజీఎంలో ఇక నుంచి 24 గంటలపాటు కొవిడ్ పరీక్షలు చేస్తామని ఆయన తెలిపారు. ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతలేదని మరోసారి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.