కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులకు కొత్త సమస్య వచ్చిపడింది. వారికి డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు కూడా సోకుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. కరోనా బాధితుల్లో సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరపగా.. చాలామందికి డెంగ్యూ, లేదా మలేరియా ఉన్నట్లు తేలిందని అంటున్నారు. ఒకే వ్యక్తికి రెండు వ్యాధులు నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందించడంలో సతమతమవుతున్నారు. ఇలా అరుదుగా వస్తుంటాయని.. దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని ఢిల్లీ ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రగ్యాన్ ఆచార్య తెలిపారు. (Corona Patients New Threat)
”దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు సహజంగా వస్తుంటాయి. ఇక ప్రస్తుత పరిస్థితులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. వారిలో చాలామందికి కరోనాతో పాటు డెంగ్యూ లేదా మలేరియా పాజిటివ్ వస్తోంది. ఇంకొందరికి అయితే డెంగ్యూ, మలేరియా రెండూ నిర్ధారణ అవుతున్నాయి. అయితే కరోనా వచ్చినవారందరికీ కూడా డెంగ్యూ, మలేరియా వస్తుందని చెప్పలేం. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుపుతున్నాం”. అని ప్రగ్యాన్ ఆచార్య తెలిపారు.