
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరిన ఆయన, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులకు పాల్పడేవారికే కొమ్ముకాస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి శిరోముండనం ఘటనలో బాధ్యుడైన ఎస్సైని అరెస్టు చేసి, రెండు రోజుల్లోనే బెయిలుపై విడుదల చేశారని హర్షకుమార్ అన్నారు. రాష్ట్రపతి స్వయంగా జోక్యం చేసుకుని ఆరా తీసిన ఈ ఘటనపైనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే ఇతర కేసుల్లో న్యాయం దొరికే పరిస్థితే లేదని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లోనే సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలికి చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా అందకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మైనారిటీలకు సైతం రక్షణ లేదని మాజీ ఎంపీ ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి, జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ జోక్యం చేసుకుని రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై విచారణ జరపాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి పోలవరం పర్యటన సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు పరిహారం కోరుతూ ఆయన్ను కలిసే ప్రయత్నం చేస్తే, ఒక్కరిని కూడా దగ్గరకు రానివ్వలేదని అన్నారు. ముంపు గ్రామాలు వందల్లో ఉన్నాయని, వేలాది మంది రైతులు భూములు కోల్పోతూ నిరాశ్రయులుగా మారుతున్నారని తెలిపారు. ముందు వారికి పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలని అన్నారు. జులైకి నిర్మాణం పూర్తి చేస్తే వర్షాలతో ముంపు తప్పదని, అందుకే ముందు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో గత 3 వారాలుగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. కొత్త చట్టాలను తయారుచేసే సమయంలో రైతులను భాగస్వాములను చేయలేదని, రైతుల లాభనష్టాల గురించి అధికారులకు ఏం తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అందుకే ముందు చట్టాలు రద్దు చేసి, రైతులతో చర్చించి కొత్త చట్టాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.