దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. సోమవారం ఒక్కరోజే ఈ జిల్లాలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లావాసుల్లో ఆందోళన కలిగించింది. సెల్వపురంలోని అయ్యప్పనగర్‌లోనే 34 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.
మరోవైపు.. సెల్వపురంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో డోర్ టూ డోర్ సర్వే చేసి కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్‌కు తరలించనున్నారు. అయితే.. ఈ ప్రాంతంలో లక్షణాలు లేని వారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయ్యప్పనగర్‌లో ఇప్పటివరకూ 114 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. కోయంబత్తూర్ జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 802కు చేరింది.