
బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఈ దీపావళికి బోనస్‌ను చెల్లించనున్నట్టు ప్రకటించింది. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్ చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. గతేడాది కార్మికులకు రూ.60,500 చొప్పున చెల్లించగా.. ఈసారి 64,700 చొప్పున బోనస్‌గా ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. జాతీయ బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం (ఎన్సీడబ్ల్యూఏ) పది ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను కార్మికుల పనితీరు ఆధారంగా పెర్ఫార్మెన్స్ లింక్డు రివార్డు స్కీం పేరుతో ఈ దీపావళి బోనస్ చెల్లింపునకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ బోనస్ మొత్తాన్ని ఈ నెల 25న కార్మికులకు చెల్లించనున్నట్టు యాజమాన్యం స్పష్టంచేసింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 48వేల మందికి పైగా కార్మికులు బోనస్ అందుకోనున్నారు.