పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటించాలి.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. సువిశాల భారతావని ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికే ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. పీవీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వాన్ని భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నామన్నారు కేసీఆర్.
అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు సీఎం. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారన్నారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి దేశచరిత్రలో ఒక విశిష్ట సందర్భం.తెలంగాణా అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను సంవత్సర కాలంపాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణా ప్రభుత్వం సంకల్పించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. పీవీ దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ ఉజ్వలంగా స్మరించుకునేలా చేయాలని తెలంగాణా ప్రభుత్వం ఆశిస్తున్నదన్నారు ముఖ్యమంత్రి.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకుడు పీవీ నరసింహారావు. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణభారతీయుడిగా, తెలంగాణా ముద్దుబిడ్డడుగా చరిత్ర సృష్టించిన ఘనుడు పీవీ నరసింహారావు. అందుకే ఇది పీవీ మన ఠీవి అని తెలంగాణా సగర్వంగా చాటుకుంటున్నదన్నారు సీఎం కేసీఆర్ రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖామంత్రిగా నియమించి పీవీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేశారు. లైసెన్స్, పర్మిట్ రాజ్ ను అంతంచేశారు. దేశాభివృద్ధిలో ప్రైవేటురంగం భాగస్వామ్యాన్ని పెంచారు. కూపాస్థ మండూకంలా మారిన దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి, దేశాన్ని బయటపడవేసి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు తీయించారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేసిన ఘతన పీవీదే. దాదాపు మూడు దశాబ్దాలు చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండడానికి పీవీనే కారణం. భూసంస్కరణలను చిత్తశుద్దితో అమలు చేశారు. రాష్ర్ట విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు. ఈ విద్యాలయాల్లో చదివిన వారు ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు. తెలుగు అకాడమీని నెలకొల్పిన ఘనత కూడా పీవీకే దక్కుతుందన్నారు. పీవీ వ్యక్తిత్వం సమున్నత వ్యక్తిత్వం. మహోన్నత తాత్వికవేత్త. అఖండమైన పాండిత్యం ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో మునిగితేలుతూనే వేయి పడగలు అనే నవలను హిందీ భాషలోకి అనువాదం చేశారు. ఈ నవల ఇతిహాసం వలే ఉంటుంది. ఈ నవలతో పీవీ పాండిత్యం ఏమిటో అర్థమవుతుంది. పీవీ దేశానికి, రాష్ట్రానికి ఎన్నో సేవలందించారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
పీవీకి భారతరత్న తీర్మానానికి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏకగ్రీవంగా మద్దతు పలికారు. పీవీ దేశానికి చేసిన సేవను ఆయన కొనియాడారు.
తెలంగాణ బిడ్డ, దక్షిణాదినుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థికసంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతికోవిదులు, బహుభాషావేత్త, దేశప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాలను ప్రకటించాలనీ, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్నీ, చిత్తరువునూ ప్రతిష్ఠించాలనీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావుగారి పేరు పెట్టాలనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.