CM Jagan Vizianagaram Tour : విజయనగరం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 11:15 గంటలకు గుంకలాం చేరుకుంటారు.
పైలాన్ ఆవిష్కరణ, అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. విజయనగరం నియోజకవర్గంలోని విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్ధిదారుల కోసం భారీ లే అవుట్ వేశారు. 4.37 కోట్లతో లే అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
పేదలకు స్థలాలు ఇచ్చేందుకు గానూ 428 మంది రైతుల నుంచి 101.73 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేసింది. విజయనగరం జిల్లా మొత్తం 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్ధిదారులు ఉన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మొత్తం 1,164 లే అవుట్‌లను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిని అభివృద్ధి చేసేందుకు రూ.10.19 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.