రాష్ట్రంలో జలవనరులను సరియైన పద్దతిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ అవసరమన్నారు. హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించాలని నిర్ణయించారు. ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి కూడా బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్ లో బాధ్యతలు అప్పగించారు. జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణతో మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకనుగుణంగా త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై ఆ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించి నిర్వహించిన సీఎం కేసీఆర్… చనాక-కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కాలువలను 2021 జూన్ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతో పాటు పెండింగ్ లో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్పి ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు ప్రారంభించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.
అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటిపై సీఎం సమీక్షించారు. గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పరకాల నియోజకవర్గంలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలని చెప్పారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం కోసం సర్వే నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా హుజూర్ నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.