
తదుపరి చర్చలకు తాము సిధ్దమని, తేదీ నిర్ణయించాలని కేంద్రం రైతు సంఘాలకు లేఖ రాసింది. మీకు అనువైన తేదీని బట్టి చర్చలు జరుపుదామని వ్యవసాయ శాఖ మంతిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మళ్ళీ ఉభయ పక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నాయి. కేంద్రం తెచ్చిన చట్టాలపట్ల మీ అపోహలను తొలగించడానికి రెడీగా ఉన్నామని, ఎలాంటి అరమరికలు లేకుండా సంప్రదింపులు జరుగుతాయని ఆశిస్తున్నామని వివేక్ అగర్వాల్ ఈ లేఖలో తెలిపారు. అయితే సోమవారం నుంచి రైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రతి రోజూ 11 మంది అన్నదాతలు 24 గంటలపాటు నిరశన చేయాలని నిర్ణయించారు. వీరి ఆందోళన సోమవారం నాటికి 26 వ రోజుకు చేరుకుంది. చలిని తట్టుకోలేక, గుండె జబ్బుల వల్ల, యాక్సిడెంట్లలో ఇప్పటివరకు 30 మందికి పైగా రైతులు మరణించారని రైతు సంఘాలు వెల్లడించాయి.
అటు-ఆందోళన చేస్తున్న అన్నదాతలకు అందించేందుకు ఫరీద్ కోట్ జిల్లాకు చెందిన రైతులు 500 కేజీల ‘బేసన్ బర్ఫీ'( సెనగపిండితో చేసిన బర్ఫీ) తీసుకురావడం విశేషం,. ట్రాక్టర్లు, ట్రాలీలలో వీరంతా బయలుదేరి వచ్చారు. ఇలా ఉండగా-కేంద్ర రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించేందుకు ఈ నెల 23 న కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ అసెంబ్లీని సమావేశపరచాల్సిందిగా గవర్నర్ ను కోరాలని మంత్రివర్గం నిర్ణ యించింది.ఈ విషయమై సీఎం, ప్రతిపక్షనేత ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని, శాసన సభలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందగలదని భావిస్తున్నారు.