ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలని దంపతులకు బలవంతం చేయలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జనాభాను నియంత్రించే ప్రయత్నంలో ప్రజలు నిర్ధిష్ట సంఖ్యలో పిల్లలను కలిగి ఉండాలని బలవంతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. దంపతులకు తమ కుటుంబాన్ని పెంచుకునేందుకు నిర్ణయించుకునే హక్కును దేశంలోని కుటుంబ సంక్షేమ కార్యక్రమం కల్పిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు అందజేసింది.
దేశంలో జనాభా నియంత్రణకు చట్టం తీసుకురావాలంటూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలో దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం వివరణ కోరగా, ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలో ఇద్దరు పిల్లలకే పరిమితం చేయడం, లేదా నిర్ధిష్ట చట్టాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తిరస్కరించింది.