
Minister Buggana fires at State Election Commissioner: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉంటూ తప్పుడు ప్రచారం చేస్తారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికమని ఆగ్రహించారు. రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా అని ప్రశ్నించారు బుగ్గన. సమీక్షలు చేయకుండా.. సంబంధిత అధికార వర్గాలో సంప్రదించకుండా వాయిదా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన అడిగారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై అంచనా వేయకుండా ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారో బదులివ్వాలన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా? రాష్ట్రంలో పరిస్థితిపై వైద్యాధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారా? ఈసీకి సీఎస్ లేఖ రాసిన తర్వాత కూడా సీఎస్‌తో ఎందుకు మాట్లాడలేదు? కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే కోడ్ ఎందుకు కొనసాగించారు? అంటూ ఈసీపై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి రాజేంద్రనాథ్.
కేవియేట్ పిటిషన్ దాఖలు చేయడంతోనే రమేశ్‌కుమార్ దురుద్దేశం అర్థమవుతుందని అన్నారు బుగ్గన . అధికార పార్టీ ఒత్తిడి ఉంటే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నామినేషన్లు ఎలా వేస్తాయని రమేశ్‌ను ప్రశ్నించారు బుగ్గన. తెలుగుదేశంపార్టీ వాళ్లు నామినేషన్లు వేయకుంటే దానికి అధికారపార్టీ ఎలా బాధ్యత వహిస్తుందని అడిగారు. కరోనాపై ముఖ్యమంత్రి జగన్ ముందస్తు చర్యలకు ఆదేశించారని….కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ వంద శాతం సీట్లు గెలిచిందని.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కావడంలో తప్పేముందన్నారు బుగ్గన. సీఎంను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు మంత్రి బుగ్గన.