ఒడిశాలోని భద్రక్ జిల్లాలో కొత్త మోటారు వాహనాల చట్టం 2019 ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, మైనర్‌కు ద్విచక్ర వాహనం ఇచ్చిన ఓ బైక్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు కళ్లు బైర్లు కమ్మే జరిమానా విధించారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని నౌపోఖరి గ్రామానికి చెందిన బాలుడు ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో బాలుడికి బైక్ ఇచ్చిన యజమాని నారాయణ్ బెహరాకు ట్రాఫిక్ పోలీసులు రూ.42,500 జరిమానా విధిస్తూ చలానా పంపించారు. మరో ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టుకుని బాలుడు బైక్‌పై వెళ్తూ భద్రక్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్‌టీవో) అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో మోటార్ వాహన చట్టం 2019 ప్రకారం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను బైక్ యజమానికి చలానా పంపించారు.
భద్రాక్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ తప్పుకింద రూ. 500, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందుకు రూ. 5 వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ. 5 వేలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో రూ. 5 వేలు, ఇద్దరి కంటే ఎక్కువమంది ప్రయాణించినందుకు రూ. 1,000, హెల్మెట్లు లేకుండా ప్రయాణించినందుకు రూ. 1,000, బాలుడికి బైక్ ఇచ్చినందుకు రూ. 25,000 జరిమానా విధించారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన రవాణాశాఖ అధికారులు.. బాలుడి తండ్రే ఆ బైక్ యజమాని అని పేర్కొన్నారు. జరిమానా ఆయన రూ.25 వేలు చెల్లించాలని, అయితే, బాలుడికి మాత్రం 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయబోమని ఆ ట్వీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.