కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా భూమిపూజ నిర్వహించారు. మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొన్నారు. టీటీడీలోని 28 మంది బోర్డు సభ్యులతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు శాసనసభ్యులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, 12 మంది ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగిందని అధికారులు తెలిపారు. దేవాలయం కోసం లీజు ప్రాతిపదికన 62 ఎకరాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది. 33కోట్ల52లక్షల రూపాయలతో 18 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తికానుంది. దేవాలయ ప్రాజెక్ట్‌లో భాగంగా వేద పాఠశాల, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించనున్నారు. ఆధ్మాత్మిక-ధ్యాన కేంద్రం, రెసిడెన్షియల్ క్వార్టర్స్, వైద్య-విద్యా కేంద్రాలను కూడా నిర్మించనున్నారు. రెండో దశల్లో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తారు. కేంద్ర పాలిత ప్రాంతమైన కశ్మీర్‌లో ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందని ఆశిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణవోదేవి, అమర్‌నాథ్ ఆలయాలకు వేల సంఖ్యలో ప్రతి ఏడాది భక్తులు వస్తుంటారు. ఇక టీటీడీ ఆలయ నిర్మాణంతో టూరిజం ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: యువతి ఆత్మహత్య.. రేపిస్టుని పట్టించిన వీర్యకణాలు