Telangana: డ్యూటీలో ఉన్నట్టు రికార్డులు.. కట్‌చేస్తే ఫామ్‌హౌస్‌లో జల్సాలు.. పోలీసుల తీరుపై
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే విధులకు దూరంగా ఉంటూ విందులు, వినోదాల్లో మునిగితేలితే..? బాధ్యతలను పక్కనపెట్టి ప్రైవేట్ ఫామ్‌హౌస్ పార్టీల్లో జల్సాలాడితే? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీసుల వ్యవహారం ఇప్పుడు ఇదే ప్రశ్నలను లేవనెత్తుతోంది. విధుల్లో ఉన్నట్లు స్టేషన్ రికార్డుల్లో నమోదు చేసుకుని.. మరోవైపు ఫామ్‌హౌస్‌లో రేన్ డ్యాన్స్‌లు, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాటలతో కాలక్షేపం చేసినట్లు ఆరోపణలు రావడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కొందరు సిబ్బంది ఈ నెల 15న ఓ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. స్టేషన్ రికార్డుల ప్రకారం మొత్తం 15 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు నమోదు కాగా.. ఎస్ఐ, ఇద్దరు ఏఎస్ఐలు మినహా మిగిలిన సిబ్బంది వేడుకలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విధులకు సెలవు పెట్టి వెళ్లాల్సిన సిబ్బంది.. అధికారికంగా డ్యూటీలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసుకుని పార్టీకి వెళ్లారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
పట్టపగలు రేన్ డ్యాన్స్.. స్విమ్మింగ్ పూల్‌లో సందడి!
విధులకు డుమ్మా కొట్టి పార్టీకి వెళ్లినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది.. అక్కడితో ఆగలేదు. తాండూర్ మండలం కత్తెర్ల గ్రామ సమీపంలోని ఓ రిసార్ట్ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో రోజంతా విందు వినోదాల్లో గడిపినట్లు తెలుస్తోంది. రేన్ డ్యాన్స్‌లు చేస్తూ.. మహిళా సిబ్బందితో కలిసి డ్యాన్స్ లు వేస్తూ.. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈనెల 15 న ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా విషయం వెలుగు చూసింది. బర్త్ డే పార్టీకి హాజరైన ఓ వ్యక్తి తన మిత్రులకు ఈ వీడియోలు షేర్ చేయడం.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఉన్నతాదికారులు ఈ ఘటనపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. రామగుండం సీపి అంబర్ కిషోర్ ఝా ఈ వ్యవహారం సీరియస్ అయినట్టు సమాచారం. శాఖ పరమైన విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు బెల్లంపల్లి వన్ టౌన్ కు చెందిన సిబ్బంది ఈనెల 15 న డ్యూటీలో ఉన్నారు. ఎంత మంది సెలవులో ఉన్నారు.
అనుమతి తీసుకుని పార్టీకి వెళ్లిన వారు ఎందరు అన్నది తేలాల్సి ఉంది. కనీసం స్టేషన్ మూవ్‌మెంట్ రిజిస్టర్‌లోనైనా వివరాలు నమోదు చేశారా..? సెలవు తీసుకున్నారా..? అధికారుల అనుమతి ఉందా..? పోలీసులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత..? బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రజలకు చట్టాలు చెప్పాల్సిన పోలీసులే నిబంధనలు పాటించకపోతే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది..? ఖాకీ యూనిఫామ్‌కు ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల విచారణ ఎలాంటి నిజాలను బయటపెడుతుందో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
