బోధన్ సెంటర్‌గా బంగ్లాదేశీయుల ప్లాన్, 72 పాస్‌పోర్టుల్లో అన్నీ నకిలీవేనని అనుమానం, అధికారుల డబ్బు కక్కుర్తి.. రంగంలోకి ఎన్ఐఎ

నిజామాబాద్‌ జిల్లాలో నకిలీ పాస్‌పోర్టు వ్యవహారం కలకలం రేపుతోంది. బోధన్ పట్టణానికి చెందిన కొందరు మీ సేవా నిర్వాహకులు పోలీసులు..

  • Venkata Narayana
  • Publish Date - 2:46 pm, Sun, 21 February 21
బోధన్ సెంటర్‌గా బంగ్లాదేశీయుల ప్లాన్, 72 పాస్‌పోర్టుల్లో అన్నీ నకిలీవేనని అనుమానం, అధికారుల డబ్బు కక్కుర్తి.. రంగంలోకి ఎన్ఐఎ

నిజామాబాద్‌ జిల్లాలో నకిలీ పాస్‌పోర్టు వ్యవహారం కలకలం రేపుతోంది. బోధన్ పట్టణానికి చెందిన కొందరు మీ సేవా నిర్వాహకులు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులకోసం కక్కుర్తి పడి వీరు నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరే బంగ్లాదేశీయులకు నకిలీ ఆధార్ కార్డులు తయారు చేయించి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. 2014 నుంచి 2021 వరకు బోధన్‌ అడ్రస్‌తో 72 పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. వీటిలో చాలా నకిలీవే అని పోలీసులు గుర్తించారు. ఇవే కాకుండా మరో 66 పాస్‌పోర్టుల అడ్రస్‌లపై కూడా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే అరుగురిని అరెస్టు చేసిన పోలీసులు …..పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఆధార్‌ కార్డులతో పాస్‌పోర్టులు పొందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ముగ్గురు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఓ బ్రోకర్ ఈ స్కామ్‌లో కీలక సూత్రధారులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో బంగ్లాదేశ్ మూలాలున్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. బోధన్‌ చిరునామాతో ఇద్దరు బంగ్లాదేశీయులు నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు పొంది దేశం దాటే ప్రయత్నం చేస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడటం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు మీ సేవా కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వీరు కొందరు బంగ్లాదేశీయులు పాస్‌పోర్టు పొందడానికి సాయం చేశారు. దీంతో తాజా ఘటనతోనూ వారికి సంబంధాలు ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ ఘటనపై NIA కూడా ఫోకస్ పెట్టింది.

బోధన్ పట్టణానికి చెందిన కొందరు మీ సేవా నిర్వాహకులు అక్రమార్జన కోసం నికిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆసరా పింఛన్లు, భూముల దస్తావేజులు, రుణాలు పొందేందుకు బ్యాంకులకు సమర్పించే పత్రాలను నకిలీవి తయారు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా పాస్‌పోర్టులు పొందడానికి బోగస్ ఆధార్ కార్డులను తయారు చేయడం వివాదాస్పదమవుతోంది. ఇలాంటి అక్రమార్కులు సులభంగా డబ్బు సంపాదన కోసం ఎంచుకున్న ఈ మార్గం దేశ భద్రతకే ముప్పు తీసుకొస్తోందని నిఘా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే బంగ్లాదేశీయులు బోధన్ టౌన్‌ను ఎందుకు సెంటర్‌గా చేసుకున్నారు? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసు రికార్డులో ఉన్న ఐఎస్‌ఐ సానుభూతిపరుల కదలికలపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది. అలాంటిది బంగ్లాదేశీయులు ఇక్కడి చిరునామాతో పాస్‌పోర్టులు పొందడం ఆందోళన కలిగిస్తోంది.

Read also :

టీకాంగ్రెస్‌కి షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఉత్తమ్‌కి రాజీనామా లేఖ, అనుచరులతో కలిసి ఢిల్లీకి పయనం

Meil : పోలవరం నిర్మాణంలో మరో మిరాకిల్, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా, స్పిల్ వే బ్రిడ్జి ఒక అద్భుతం