ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో షాక్ తగిలింది. ఈ సారి చమురు కంపెనీల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తమ కంపెనీలకు ఉన్న బకాయిలను ఈ నెల 18 లోపు చెల్లించాలని.. లేని పక్షంలో ఎయిర్ ఇండియా సంస్థకు ఇంధన సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు ఇంధనం సరఫరా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు గురువారం ఎయిరిండియాకు లేఖ రాశాయి. దీంతో 18 నుంచి ఎయిర్ ఇండియా విమానాలు నడుస్తాయా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.
గత ఎనిమిది నెలలుగా ఎయిర్ ఇండియా ఇంధనానికి డబ్బులు చెల్లించలేదని, ఈ బిల్లుల విలువ రూ.5వేల కోట్లకు చేరుకుందని ఆగస్టులో ఇంధన కంపెనీలు ఎయిరిండియాకు తెలిపాయి. దీంతో కొచ్చి, మొహాలి, పుణె, పట్నా, రాంచీ, విశాఖపట్నం విమానాశ్రయాలకు ఆగస్టు 22న ఇంధన సరఫరా నిలిపివేశాయి. ఆ తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖ కల్పించుకోవడంతో సెప్టెంబర్ 7నుంచి మళ్లీ ఇంధన సరఫరా సేవలను కొనసాగించాయి. ఇక నెలవారీగా ఎయిర్ ఇండియా డబ్బు చెల్లించకుంటే ఆరు ప్రధాన విమానాశ్రయాల్లో ఆయిల్ సరఫరాను నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీలు తుది హెచ్చరిక జారీ చేశాయి. ఇప్పటికే 2018-19 సంవత్సరంలో రూ. 8,400 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. అంతేకాదు ప్రస్తుతం రూ. 60 వేల కోట్ల రూపాయల అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో ఇక ఎయిర్ ఇండియాకు ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరాను నిలిపివేస్తే మరింత నష్టం వాటిల్లనుంది. ఎయిరిండియాలో నెలకొన్న ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంస్థ నష్టాలను తగ్గించడానికి ఎయిరిండియాను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంధన సంస్థలు నిజంగానే ఈ నెల 18 నుంచి ఇంధన సరఫరా నిలిపివేతస్తే.. ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలకు బ్రేకు పడనుంది.