AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూజువాణి ఓటుతో గెహ్లాట్ సర్కార్ విజయం

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారంనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సునాయాసంగా గెలుపొందారు.

మూజువాణి ఓటుతో గెహ్లాట్ సర్కార్ విజయం
Balaraju Goud
|

Updated on: Aug 14, 2020 | 6:02 PM

Share

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారంనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సునాయాసంగా గెలుపొందారు. సచిన్ పైలట్, ఆయన వర్గీయులైన ఎమ్మెల్యేలు సొంతగూటికి తిరిగి రావడంతో గెహ్లాట్ సర్కార్ గెలుపు నల్లేరుమీద నడకే అయింది. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కాగా.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని ప్రతిపక్ష బీజేపీకి ఇవ్వకుండా గెహ్లాట్ ఎత్తు వేసి విజయం సాధించారు. ప్రభుత్వమే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గింది. మూజువాణి ఓటుతో గెహ్లాట్ సర్కార్ గెలుపొందింది. అనంతరం శాసనసభను ఆగస్టు 21కు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. తొలుత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ నేతల మధ్య వాడివేడీగా మాటల యుద్ధం సాగింది.

విశ్వాస పరీక్ష అనంతరం సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తెచ్చిన విశ్వాస తీర్మానం మంచి మెజారిటీతో సభలో గెలుపొందిందని చెప్పారు. విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం ప్రభుత్వానికే అనుకూలంగా వచ్చిందన్నారు. అలాగే రాజస్థాన్ రైతుల సమస్యల పరిష్కరానికి కృష్టి చేస్తానని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్ష ప్రయత్నాలు ఆగలేదన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష బీజేపీ చేసిన ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరబోవని స్పష్టం చేశారు. దేశంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని గెహ్లాట్ ఆరోపించారు.

సభలో సీటు కేటాయింపు విషయంలో జరిగిన మార్పుపై పైలట్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు, ఎక్కడ కూర్చున్నామనేది ప్రధానం కాదని చెప్పారు. ప్రజల హృదయాల్లో నిలిచి ఉండటమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సీటు కేటాయింపు అనేది స్పీకర్‌ నిర్ణయానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు ఫైలట్.