Ashok Gajapathi Raju – MANSAS: తమను వేధించేందుకే జగన్ ప్రభుత్వం ఎంక్వైరీలు వేస్తుందని మాన్సస్ ట్రస్ట్ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. సంచయిత చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు అవకతవకలు జరిగాయని ఎందుకు నిర్ధారించలేకపోయారని అశోక్ ప్రశ్నించారు. భూముల్లో అవకతవకలు జరిగాయని అంటున్నారు తప్ప.. రికార్డుల్లో లేని భూముల సర్వే నెంబర్లు ఎందుకు బయట పెట్టడం లేదని మండిపడ్డారు. మరోవైపు ఊర్మిళ గజపతి మాన్సస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా తనకు అవకాశం కల్పించాలని హైకోర్టుని ఆశ్రయించటం పై కూడా ఇవాళ టీవీ9తో అశోక్ గజపతి స్పందించారు.
సింహాచలం భూములపై గత రెండేళ్ల నుంచి విచారణ చేస్తున్నామని చెబుతున్న జగన్ సర్కారు.. సీల్డ్ కవర్‌లకే పరిమితం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. సింహాచలం భూముల విషయంలో తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు రాలేదని అశోక్ తెలిపారు. మాన్సస్ వ్యవహారం కుటుంబ తగాదా అని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు చైర్మన్ నియామకానికి ఎందుకు జీవో జారీ చేసిందని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ఎన్ని కుటుంబ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందో చెప్పాలని అశోక్ డిమాండ్ చేశారు. హైకోర్టుకు ఎవరైనా వెళ్లొచ్చని, మాన్సస్ అనేది సొంత వ్యవహారం కాదన్నారు. మాన్సస్, దేవాలయ భూములు సొంత ఆస్తులు కాదని స్పష్టం చేశారు. కోర్టులు తప్పబడుతున్నా.. ప్రభుత్వం తప్పులు చేయడం మాత్రం మానడం లేదని అశోక్ దుయ్యబట్టారు.