సీఎం జగన్‌కు ఆర్మీ జవాన్ రిక్వెస్ట్…. ఇంటిని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు…

| Edited By:

Dec 06, 2020 | 7:50 PM

తను కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను కోరారు ఆర్మీ జవాన్ గోవిందరెడ్డి.. ఇంత అన్యాయాన్ని భరించేకంటే సరిహద్దుల్లో చనిపోవడమే బెటరని ఆవేదన వ్యక్తం చేశాడు.

సీఎం జగన్‌కు ఆర్మీ జవాన్ రిక్వెస్ట్.... ఇంటిని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు...
Follow us on

కష్టపడి కట్టుకున్న తన ఇంటిని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో‌లో సీఎం జగన్‌ను కోరాడు. ఇంత అన్యాయాన్ని భరించేకంటే సరిహద్దుల్లో చనిపోవడమే బెటరని ఆవేదన వ్యక్తం చేశాడు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని బరంపేటకు చెందిన గోవింద రెడ్డి ఆర్మీలో జవాన్ గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో 2010లో స్థలం కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకున్నారు. ఇటీవల అతడి ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో కూల్చివేశారు. ఐతే మున్సిపల్ అధికారులే ఈ పనిచేశారని అతడు ఆరోపిస్తున్నాడు.

న్యాయం చేయలేకపోతే నన్ను అక్కడే పూడ్చేయండి….

పదేళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమి ఇప్పుడు ప్రభుత్వ భూమి ఎలా అవుతుందని ప్రశ్నించాడు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు. తనకు న్యాయం చేయలేకపోతే మా స్థలంలోనే నన్ను పూడ్చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు. సొంతూర్లోనే రక్షణ లేకుంటే సరిహద్దుల్లో ఎలా పనిచేయగలమని అన్నాడు. ఇంతకంటే సరిహద్దుల్లో చనిపోవడమే మేలు అని వ్యాఖ్యానించాడు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సపోర్ట్‌తోనే ఎవరో ఈ పని చేసుంటారని ఆరోపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు నరసరావుపేట మున్సిపల్ అధికారులు మాత్రం అది ప్రభుత్వ భూమేనని వివరించారు. గోవిందరెడ్డికి భూమి విక్రయించిన వారు డాక్యుమెంట్లపై తప్పుడు సర్వే నెంబర్లు వేసి విక్రయించారని తెలిపారు. బరంపేట ఏరియాలో తాము ఎలాంటి ఇల్లు కూల్చలేదని చెబుతున్నారు. గోవింద రెడ్డి ఇంటిని కూల్చింది ఎవరో తెలియదని అన్నారు. అయితే బాధితుడు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.