కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం మహమ్మారి నియంత్రణ దిశగా పలు చర్యలు చేపడుతోంది. వైద్య రంగంలో నూతన నియామకాలను చేపట్టింది. వారం రోజుల్లోగా 26,778 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టులన్నింటినీ ఆగస్టు 5లోగా భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీళ్లందరినీ జూలై 30 నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమించుకోవాలని సూచించింది.
నేటి నుంచే నియమకాలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు ఇలా మొత్తం 26,778 మందిని నియమించనున్నారు. ఆరు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన వీరిని నియమిస్తారు. నియామకం పూర్తయిన రోజే విధుల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల కల్లా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఎంపికైనవారి వివరాలు పంపాల్సి ఉంటుంది.