గృహిణులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రం హోమ్, కో-వర్కింగ్ సెంటర్‌లతో ఇకపై మహిళలకు ఉపాధి మార్గాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. కో-వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోమ్‌తో మానవ వనరుల సమర్థ వినియోగం వైపుగా అడుగులు వేస్తుంది. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పిస్తూ అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయనున్నారు.
ఏపీలో చదువుకున్న మహిళలు గృహిణిలుగా మిగిలిపోకూడదనీ, వారికి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. వర్క్ ఫ్రం హోమ్, కో-వర్కింగ్ సెంటర్‌లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు ఇవ్వనున్నారు. మహిళలను ఇంటికి, ఇంటి పనికి పరిమితం చేయడం సరికాదని.. ఇప్పటికీ చదువుకున్న మహిళలు ఇళ్లల్లో ఉంటున్నారని… వారికి వర్క్ ఫ్రం హోమ్ అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పనిచేసి ఉపాధి పొందుతారని భావిస్తుంది. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉన్న, కుటుంబ వ్యవహారాలు, బాధ్యత కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం అయిపోతారు. ఇలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే.. ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని భావిస్తుంది ఏపీ ప్రభుత్వం.
కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో 2025 డిసెంబర్ చివరినాటికి 1.50 లక్షల సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. ఒక్కో సీటుకు 50-60 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని.. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చెయ్యనున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది వర్క్ ఫ్రం హోమ్‌లో పనిచేస్తున్నారు.. వారి అవసరాలు ఏంటనే సమాచారం సేకరించనున్నారు. అదే విధంగా ఇప్పటికే నిర్ణయించినట్లు రతన్ టాటా ఇన్నో వేషన్ హబ్‌ల ఏర్పాటుకు రాష్ట్రంలో 5 చోట్ల భవనాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్‌లకు అనుసంధానం చెయ్యనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..