చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆస్పత్రుల నిర్మాణంః వైఎస్ జగన్

|

Sep 30, 2020 | 4:48 PM

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష.

చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆస్పత్రుల నిర్మాణంః వైఎస్ జగన్
Follow us on

రాష్ట్రంలో అత్యాధునిక హంగులతో అస్పత్రుల నిర్మాణం సాగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయన్నారు. అమరవతిలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆస్పత్రులలో నాడు–నేడు కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మించతలపెట్టి ఆస్పత్రులు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలన్నారు సీఎం జగన్. అన్ని ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలన్న సీఎం.. నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. ఆస్పత్రులన్నింటిని కార్పొరేట్‌ స్థాయికి ధీటుగా నిర్మాణం సాగాలన్న సీఎం.. ఆస్పత్రుల్లో యంత్రాలు, ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి అన్నింటి నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలని సూచించారు. విద్యుత్ ఖర్చు తగ్గించుకునేందుకు అవసరం అయితే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్న సీఎం.. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు.

అంతకుమందు ఆస్పత్రిల్లో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపిస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. బాపట్ల, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, మార్కాపురం, మదనపల్లె, నంద్యాల మెడికల్‌ కాలేజీల టెండర్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ అక్టోబరులో జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక, నరసాపురం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల టెండర్లను నవంబరు నెలలో జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపిస్తామని వెల్లడించారు.

సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలోని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసిన అధికారులు.. రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రి పై సిఎం జగన్ కు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాడేరు వైద్య కళాశాలతో పాటు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను అక్టోబరు 2 న సిఎం వైయస్‌ జగన్ శ్రీకారం చుట్టనున్నారు.