
చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు వినతి పత్రం అందజేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ముఖ్య అధికారులతో భేటీ అయిన ఆయన ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా ఖండించారు. తొమ్మిది కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ గతంలో తామిచ్చిన ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని.. ఇక రీసెంట్ గా వైసీపీ రీపోలింగ్ కు డిమాండ్ చేస్తే మాత్రం పట్టించుకున్నారని బాబు ఆరోపించారు. భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ పని తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సి రావడం చాలా దురదృష్టకరమని సీఎం వ్యాఖ్యానించారు.