వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి ఆందోళన.. కల్తీ కల్లు ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
వికారాబాద్ జిల్లా కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

వికారాబాద్ జిల్లా కల్తీకల్లు ఘటనలో మరో ఇద్దరు మృతిచెందారు. నవాబ్‌పేట్ మండలం వట్టిమినేపల్లికి చెందిన కొమురయ్య (90) ఇవాళ ఉదయం తన నివాసంలో మృతి చెందగా, వికారాబాద్ మండలంలోని పెండ్లిమడుగుకు చెందిన పెద్దింటి సంతోష (50) మరణించారు. వికారాబాద్ మండలంలోని పెండ్లిమడుగు గ్రామానికి చెందిన బిల్లకంటి కిష్టారెడ్డి (52) ఇప్పటికే మృతి చెందారు. దీంతో కల్తీకల్లు తాగి మృతిచెందినవారి సంఖ్య మూడుకు చేరింది. వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాల్లో కల్తీకల్లు తాగి 300 మందికిపైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా 12 గ్రామాల ప్రజలు ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయారు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వింత వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మగ్గురు మృతి చెందగా, మిగతావారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనికి కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.
వికారాబాద్ జిల్లా చిట్టిగిద్దలో కృత్రిమ కల్లు తయారు చేస్తుంటారు. ఇక్కడి నుంచే నవంపేటతో పాటు వికారాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు కల్లు సరఫరా చేస్తుంటారు. ఈ కల్లు ఎక్కడికి సరఫరా అవుతుందో అక్కడి వాళ్లు మాత్రమే ఫిట్స్ వచ్చి పడిపోతున్నట్టు తెలుస్తోంది. కల్తీ కల్లు తాగడం వల్లే ఫిట్స్ వచ్చి పడిపోయారని, ఈ కల్లు విక్రయించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
కాగా, అస్వస్థతకు కారణమైన చిట్టిగిద్ద కల్లు డిపోను అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలను మూసివేశారు. కల్తీ కల్లు ఘటనకు గల కారణాలపై ఎక్సైజ్ అధికారులతోపాటు, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
