ఏపీలో విత్తన ఏటీఎంలు.. త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. రైతులను డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్తోంది. ఊరూరా విత్తనాల ఏటీఎంలు ఏర్పాటు చేయబోతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. రైతులను డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్తోంది. ఊరూరా విత్తనాల ఏటీఎంలు ఏర్పాటు చేయబోతోంది. ఈ ‘ఏటీఎం’ల ద్వారా ఉత్పాదకాలను రైతులకు అందించనున్నారు. ఇందు కోసం 10,641 గ్రామాలను ఎంపిక చేశారు.
రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్ కియోస్క్ ‘ఏటీఎం’లను ఏర్పాటు చేస్తారు. ఈ ‘కియోస్క్’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్ వంటి మార్కెటింగ్ సేవలు రైతులకు అందించనున్నారు. ఇది దేశ చరిత్రలోనే తొలి ప్రయోగం.
రైతులకు ప్రభుత్వం అందించే అన్నింటిని కియోస్క్ ‘ఏటీఎం’ల ద్వారా తీసుకోవచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన అన్ని వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల ప్రత్యేకత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ ఏటీఎం కేంద్రంగా రైతులు నిర్వహించుకోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీసుకుంటున్నామో.. అదే తరహాలో సులువుగా ఈ మిషన్ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ‘కియోస్క్’ ఏటీఎం సెంటర్లను ఈ నెల 30న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.